సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, అధిక గాలులకు దెబ్బతిన్న పంటలను కాపాడటంలో ఆర్బీకై సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది. వర్షం తెరిపివ్వడంతో పంటలను, పంట ఉత్పత్తులను కాపాడటంలో విశేష కృషి చేస్తూ రైతుల్లో ధైర్యాన్ని నింపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలను వ్యవసాయ శాఖ ముమ్మరం చేసింది. క్షేత్రస్థాయి సిబ్బంది ఆర్బీకేల ద్వారా పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ.. పొలాల్లోని వరి పనలు మొలకెత్తకుండా ఉండేందుకు 5 శాతం ఉప్పు ద్రావణాన్ని రైతులతో కలిసి పనలపై సామూహికంగా చల్లుతున్నారు.
పొలాల్లో నిలిచిపోయిన నీటిను కిందకు పోయేలా చేస్తున్నారు. తడిసిపోయిన పనలను రైతు కూలీలతో కలిసి ఒడ్డుకు తీసుకొచ్చి ఉప్పు ద్రావణం చల్లే ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల సమన్వయంతో కాలువలు, డ్రెయిన్లను ఉపాధి హామీ కూలీల సహకారంతో మరమ్మతులు చేసి పంట పొలాల నుంచి వర్షపు నీటిని బయటకు పంపుతూ రైతులకు ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పంట కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో నీరు నిలిచి ఉంటే.. చేలల్లో చిన్నపాటి బాటలు, బోదెలు తీసి మడుల నుంచి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఆర్బీకే సిబ్బంది స్వయంగా చేలలో నేలకు పడిపోయిన వరి దుబ్బులను లేపి.. కట్టలు కట్టే ప్రక్రియలో రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. పంట నష్టం అంచనాలకు ఎన్యుమరేషన్ బృందాలను ఏర్పాటు చేశామని, ముంపు నీరు పూర్తిగా చేల నుంచి తొలగిన తర్వాత పంట నష్టం అంచనా వేసేందుకు ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాయని వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment