సాక్షి, హైదరాబాద్: ‘మన జీవితాల్లో అత్యంత కీలకమైనది..అందుకు తగ్గ గుర్తింపు లేని అంశం ఏదైనా ఉంది అంటే.. అది మన పాదాల కింది మట్టేనని’ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, మొక్కలు, వృక్షాల వేళ్లతో కూడిన ఈ సంక్లిష్ట జీవావరణ వ్యవస్థను కాపాడుకోవడం ఇప్పుడు మనిషికి అత్యవసరమన్నారు. హైదరాబాద్ సమీపంలోని ‘కాన్హా శాంతివనం’లో ‘4 పర్ 1000’ పేరుతో మట్టి సంరక్షణ లక్ష్యంగా బుధవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జర్మనీ, ఫిజీలతోపాటు సుమారు 18 దేశాల వ్యవసాయశాఖల మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ నీరు, పోషకాలతో కూడిన మట్టి అటు వాతావరణాన్ని నియంత్రించడమే కాకుండా, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకూ సాయపడుతోందని చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మట్టి సారం తగ్గిపోతుండటం, సారవంతమైన మట్టి కొట్టుకుపోవడం మానవాళి మనుగడకు ముప్పు కలిగించేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారభద్రత, పర్యావరణ సమతుల్యతలకూ ప్రమాదకరంగా మారిన ఈ సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు.
ఆర్థిక విలువ జోడించాలి: దాజి, ఆధ్యా త్మిక గురువు
దేశంలోనే అత్యంత వేగంగా పచ్చదనం పెంచుకుంటున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోందని, అయితే మొక్కల పెంపకం ఏదో మొక్కుబడి తంతుగా కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేదిగా మార్చాలని ‘హార్ట్‌ఫుల్‌నెస్ ఇనిస్టిట్యూట్’ ఆధ్యాత్మిక మార్గదర్శి, రామచంద్రమిషన్ అధ్యక్షుడు దాజి తెలిపారు. బంజరుభూమిని కూడా ఎంత అద్భుతమైన, జీవవంతమైన నేలగా మార్చవచ్చో కాన్హా ద్వారా స్పష్టంగా తెలుస్తుందని ఆయన చెప్పారు.
తెలంగాణలోని ప్రతిగ్రామంలో మొక్కల నర్సరీలు ఏర్పాటు చేయడం బాగుందని.. అయితే ప్రభుత్వం చెట్లు నరికేయకుండానే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికదన్ను అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇంధన అవసరాలు తీర్చే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫిజీ వ్యవసాయశాఖ మంత్రి సకయాసీ రాల్‌సెవూ డిటోకా, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ (బెంగళూరు) థియరీ బెర్త్‌లాట్, వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు, ‘4 పర్ 1000’ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి డాక్టర్ పాల్‌లూ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో వాతావరణ మార్పులు, ఆహార భద్రతను ఎదుర్కొనేందుకు మట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా అన్న అంశంపై చర్చలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment