జాఫర్ సాధిక్
సాక్షి, చైన్నె: మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో తమిళ సినీ నిర్మాత జాఫర్ సాధిక్‌ను శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆయన వద్ద తీవ్ర విచారణ జరుగుతోంది. గతనెల ఢిల్లీలో రూ. 2 వేల కోట్లు విలువైన మాదక ద్రవ్యాలు బయటపడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. విచారణలో ఈ స్మగ్లింగ్‌కు సూత్రదారి చైన్నెకు చెందిన సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాధిక్‌గా తేలింది. మూడేళ్లలో జాఫర్ సాధిక్ ముఠా 3,500 కేజీల మత్తు పదార్థాలను తమిళనాడు నుంచి పలు దేశాలకు స్మగ్లింగ్ చేసినట్టు విచారణలో తేలింది.
తనను ఎన్‌సీబీ టార్గెట్ చేయడంతో జాఫర్ సాధిక్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి సోదరులు సలీం, మైదీన్ కూడా పత్తా లేకుండా పోయారు. ఇంట్లో ఉన్న వాళ్లందరూ ఎక్కడకువెళ్లారో అంతు చిక్కని పరిస్థితి. విచారణకు రావాలని జాఫర్ సాధిక్ ఇంటి వద్ద ఎన్‌సీబీ అధికారులు నోటీసులు అంటించి సైతం వెళ్లారు. అజ్ఞాతంలో ఉన్న సాధిక్ కోసం పలు నగరాల్లో గాలించారు. నెల రోజులుగా మకాం మారుస్తూ వచ్చిన సాధిక్ ఎట్టకేలకు ఎన్‌సీబీ అధికారులకు చిక్కారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో శనివారం అతడిని అరెస్టు చేశారు. ఢిల్లీకి తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు.
ఈ విషయంగా ఎన్‌సీబీ అధికారి జ్ఞానేశ్వర్ పేర్కొంటూ, అరెస్టు చేశామని విచారణ జరుగుతోందన్నారు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన సొమ్మును జాఫర్ సాధిక్ సినిమాలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందన్నారు. ఇతగాడితో సత్సంబంధాలు కలిగిన వారి వివరాలను సేకరిస్తున్నామని, అలాగే, ఏదేని రాజకీయ పార్టీ, నాయకులకు నిధులు, విరాళాలు ఇచ్చి ఉన్న పక్షంలో వారిని కూడా విచారణ వలయంలోకి తీసుకొచ్చే విధంగా ఎన్‌సీబీ ఉరకలు తీస్తుండటం గమనార్హం. ఇతగాడు ఫుడ్ డెలివరి, ఫుడ్ ఎగుమతి పేరిట మాదక ద్రవ్యాలు విదేశాలకు పెద్దఎత్తున పంపించినట్టు విచారణలో వెలుగు చూసింది.
Comments
Please login to add a commentAdd a comment