శాసనసభకు చేరిన పవర్ లూం పోరు
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అదే సమయంలో మంత్రి దురై మురుగన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాలంటే కనీసం రెండు మూడు గంటలు రిహార్సల్స్ చేయాల్సి ఉందని చమత్కరించి అందర్నీ నవ్వించారు. చైన్నెలో 30 కొత్త పార్కులను ఏర్పాటు చేయనున్నామని మంత్రి నెహ్రూ ప్రకటించారు. తొల్కాపియర్ పార్కు పునరుద్దరణ పనులు వేగవంతం చేశామన్నారు. సహకార సంఘాల ద్వారా విద్యా రుణాల పంపిణికి పరిశీలన చేస్తామని మంత్రి పెరియకరుప్పన్ తెలిపారు. ప్రశ్నోత్తరాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత పళనిస్వామి తిరుప్పూర్, కోయంబత్తూరు, ఈరోడ్‌లోని వేలాది పవర్ లూం యాజమాన్యాల ఆందోళన, కార్మికుల కష్టాలను సభ ముందు ఉంచారు.
పళణికి చాన్స్
తక్షణ సమస్యగా పవర్‌లూం అంశాన్ని పరిగణించారు. నేత కార్మికుల సమస్యలపై స్పీకర్ అప్పావు స్పందించారు. అనంతరం పళణి స్వామికి ప్రసంగించే అవకాశం కల్పించారు. పెరిగిన ముడి పదార్థాల ధరలు, విద్యుత్‌చార్జీల పెంపు, తదితర అంశాలను పవర్ లూం యజమానులను కష్టాల పాలు చేసి ఉందన్నారు. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా వారు పోరు బాట పట్టిన నేపథ్యంలో 1.50 లక్షల మంది కార్మికులు రోడ్డున పడి ఉన్నారని వివరించారు. కార్మికులు న్యాయం జరగాలని, కూలి పెంపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు మంత్రి గాంధీ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపడుతామని, కార్మికులు, యాజమాన్యాలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు. కార్మికుల జీవనాధారం దెబ్బ తినకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
పర్యాటక ప్రగతి
అసెంబ్లీలో పర్యాటక శాఖకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకు సంబంధించి ఆ శాఖ మంత్రి రాజేంద్రన్ సభ ముందు పద్దులను ఉంచారు. రాష్ట్రం పర్యాటకంగా ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు. దేశ విదేశాల నుంచి పర్యాటకుల రాక పెరిగిందని, వీరికి కావాల్సిన అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. గత ఏడాది పర్యాటకం ద్వారా రూ. 39 కోట్ల మేరకు రాబడి వచ్చినట్టు వివరించారు. కొత్త పర్యాటక ప్రదేశాలను గురించి వాటి అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. మహాబలిపురం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి సముద్ర తీర నగరాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు రూ. 300 కోట్లు నిధులను కేటాయించామని ప్రకటించారు.
తిరుప్పూర్, కోయంబత్తూరు,
ఈరోడ్‌లలో జరుగుతున్న పవర్ లూం కార్మికుల పోరు అసెంబ్లీకి గురువారం చేరింది. కార్మికుల కష్టాలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి స్పందించారు. తక్షణ చర్యలు చేపడుతామని మంత్రి గాంధి హామీ ఇచ్చారు. ఇక, సముద్ర తీర పర్యాటక నగరాల ప్రగతికి రూ. 300 కోట్లతో బహృత్తర ప్రణాళిక సిద్ధం చేశామని పర్యాటక మంత్రి రాజేంద్రన్
అసెంబ్లీలో ప్రకటించారు.
కార్మికుల కష్టాలపై పళణి ఆవేదన
తక్షణం చర్యలు చేపడుతామన్న
మంత్రి గాంధీ
సముద్ర తీర పర్యాటక నగరాల
ప్రగతికి రూ. 300 కోట్లు
చైన్నెలో 30 పార్కులు
శిల్పి స్టాలిన్..
అసెంబ్లీలో హిందూ, ధర్మాదాయ శాఖ నిధుల కేటాయింపునకు సంబంధించిన చర్చలో మంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలలో రూ. 7,850 కోట్లు విలువైన అన్యాక్రాంతమైన ఆలయ ఆస్థులను స్వాధీనం చేసుకున్నామన్నారు. 5 వేల ఎకరాల స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. తిరుచెందూరును తిరుపతి తరహాలో తిర్చిదిద్దిన శిల్పి సీఎం స్టాలిన్ అని కొనియాడారు. కాగా, సభలో మంత్రి శేఖర్‌బాబు మాట్లాడే సమయంలో తమను ఉద్దేశించి ఏక వచనంతో వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నాడీఎంకే సభ్యులు నిరసనకు దిగారు. ఆ పార్టీ శాసన సభా పక్ష ఉపనేత ఆర్‌బీ ఉదయకుమార్ స్పందిస్తూ, శేఖర్‌బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సమయంలో పరస్పరం వాగ్వాదం చోటు చేసుకోగా స్పీకర్ అప్పావు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. ఇదిలా ఉండగా, బడ్జెట్ చర్చకు ముందుగా మంత్రి శేఖర్‌బాబు దివంగత డీఎంకే అధినేత కరుణానిధి సమాధిని సందర్శించి నివాళుర్పించారు. అయితే, ఆ సమాధిని శ్రీవిళ్లిపుత్తూరు ఆలయ గోపురం ఆకారంలో పుష్పాలతో అలంకరించడం వివాదానికి దారి తీసింది. హిందువుల మనో భావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మంత్రి క్షమాపణలు చెప్పాలన్న నినాదాన్ని బీజేపీ అందుకుంది. కాగా అసెంబ్లీలో 2025–26 సంవత్సరానికి గాను కళలు, సాంస్కృతిక విభాగం తరపున బడ్జెట్ ఆ శాఖ మంత్రి స్వామినాథన్ దాఖలు చేశారు.


