
ఢిల్లీకి గవర్నర్
– మూడు రోజుల పర్యటన
సాక్షి, చైన్నె : రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్‌రవి ఢిల్లీకి వెళ్లారు. మూడు రోజులు అక్కడే ఉంటారు. చట్ట నిపుణులు, మంత్రులతో భేటి కానున్నట్టు సమాచారం. రాష్ట్ర గవర్నర్‌కు వ్యతిరేకంగా గత వారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గురించి తెలిసిందే. గవర్నర్‌కు అక్షింతలు వేస్తూ, ప్రభుత్వానికి అనుకూలంగా పది ముసాయిదాల విషయంగా చారిత్రాత్మక తీర్పును కోర్టు ఇచ్చింది. ఈ తీర్పు తదుపరి గవర్నర్ రీకాల్‌కు పట్టుబడుతూ నినాదాలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితులలో గవర్నర్ రవి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం చైన్నె నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం వరకు అక్కడే ఉంటారని సమాచారం. సుప్రీం కోర్టు కేసు విషయంగా చట్ట నిపుణులతో చర్చించి అప్పీలుకు వెళ్లడమా? లేదా మరేదేని ప్రత్యామ్నాయం అన్వేషించడమా? అన్న దిశగా కసరత్తుల్లో గవర్నర్ ఉన్నట్టు సమాచారం. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటూ న్యాయ, విద్యా మంత్రులతో సైతం సమావేశానికి నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు ఇచ్చినతీర్పుతో అన్ని వర్సిటీలను ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకుంటూ గెజిట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. వీసీలు, రిజిస్టార్‌లో సీఎం స్టాలిన్ సైతం సమావేశం నిర్వహించడం గమనార్హం.
మంత్రి పొన్ముడికి చిక్కులు
– కేసు నమోదుకు కోర్టు ఆదేశం
సాక్షి, చైన్నె : మంత్రి పొన్ముడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ బెంచ్ తీవ్రంగా పరిగణించింది. బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా, కేసు నమోదుకు పోలీసులను ఆదేశించింది. శైవ– వైష్ణవులను కించ పరిచే విధంగా, మహిళను అవమానించే రీతిలో అటవీ శాఖ మంత్రి పొన్ముడి చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆయన చేతిలో ఉన్న డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఊడింది. అదే సమయంలో ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించాలన్న నినాదం మిన్నంటుతున్నది. ఈ పరిస్థితులలో ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఉదయం, సాయంత్రం ఈ పిటిషన్ విచారణ జరిగింది. బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్లు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత క్షమాపణలు కోరితే సరి పోతుందా అని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతా తెలిసే వ్యాఖ్యలు చేసినట్టుందని , ఇదే మరొకరు చేసి ఉంటే ఈ పాటికి 50 కేసులు నమోదై ఉండేదన్నారు. ఇంత వరకు ఎందుకు కేసు నమోదు చేయాలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. కేసు నమోదుకు ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేశారు. కేసు నమోదు చేయనిపక్షంలో కోర్టు ధిక్కారానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా గత ఏడాది అక్రమాస్తుల కేసులో విముక్తి పొందిన పొన్ముడితో పాటూ పలువురు మంత్రులపై సుమోటో కేసు నమోదు చేసి విచారణకు ఇదే న్యాయమూర్తి ఆదేశించడం గమనార్హం.
గణేష్ బీ కుమార్‌కు
సింఫనీ రైజ్ అవకాశం
సాక్షి, చైన్నె : హంగేరీలోని బుడాపెస్ట్‌లో ప్రపంచ ప్రీమియర్‌ను చైన్నెకు చెందిన సంగీత కారుడు గణేష్ బి. కుమార్ అందుకోనున్నారు. ఇందులో సింఫనీ ‘రైజ్’కు అవకాశం దక్కించుకున్నారు. చైన్నెలో నివసిస్తున్న ప్రముఖ సంగీతకారుడు, లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి డ్యూయల్ లైసెన్సియేట్ (ప్రదర్శన – సిద్ధాంతం) పట్టా పొందిన స్వరకర్త గణేష్ బి. కుమార్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈ వివరాలను గురువారం స్థానికంగా ప్రకటించారు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో వరల్డ్ ప్రీమియర్‌ను అందుకోవడానికి సిద్ధంగా ఉండటంతో చారిత్రాత్మక మైలురాయిని దక్కించుకోనున్నారు. ఈనెల 27న సింఫని రైజ్ కచేరీలో ది ఐకానిక్ పెస్టి విగాడో సెరిమోనియల్ హాల్‌ను ప్రఖ్యాత వియన్నా మాస్ట్రో ఆంథోనీ ఆర్మోర్ నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా ప్రదర్శిస్తుంది.సింఫొనీ అనేది సాధారణంగా పూర్తి ఆర్కెస్ట్రా కోసం వ్రాయబడిన పెద్ద స్థాయి సంగీత కూర్పు అని ఈసందర్భంగా గణేష్ బీ కుమార్ పేర్కొన్నారు. వరల్డ్ ప్రీమియర్ మొదట జూలై 2020కి నిర్ణయించబడిందని, అయితే, కోవిడ్ కారణంగా వాయిదా పడి ఈనెల 27న జరగనున్నట్టు వివరించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం దక్కిందన్నారు.

ఢిల్లీకి గవర్నర్

ఢిల్లీకి గవర్నర్