రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీస్ ఫోకస్
బియ్యం సేకరణ ముఠాలోని కీలక వ్యక్తులపై నిఘా
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమార్కుల భరతం పట్టేందుకు పోలీస్‌శాఖ సిద్ధమైంది.ఇప్పటికే డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్, పౌరసరఫరాలశాఖ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేపట్టనున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొన్ని ముఠా లు అక్రమంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిస్తున్నాయి.
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి లో ఈ ముఠాలు బియ్యాన్ని తక్కువ ధరకు వివి ధ మార్గాల్లో సేకరించి, వాటిని ఇతర రాష్ట్రాలకు తర లిస్తుండగా, అన్ని స్థాయిల్లో నిఘా పెట్టారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠాలతో అంటకాగుతున్న పోలీసు అధికారులపైనా వేటు వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నా రు. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి, ఇతర పద్ధతు ల్లో అవినీతి అధికారుల వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది.
కీలక నిందితులపైనే గురి
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా ఎక్కువగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రోకర్ల ద్వారా ఈ ముఠాలు లబి్ధదారుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నాయి. రేషన్ దుకాణాల నుంచి బియ్యం లబ్ధిదారులు తీసుకున్న వెంటనే వారికి కిలోకు రూ.10 నుంచి రూ.12 చెల్లిస్తున్నారు. వాటిని మండల స్థాయిలో మరో దళారీకి చేరవేసి, అక్కడి నుంచి జిల్లా స్థాయికి పంపించి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదంతా స్థానిక పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులకు తెలిసే జరుగుతుందన్నది బహిరంగ రహస్యం.
ప్రధానంగా వీటిని మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు, ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిస్తున్నట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పోర్టుల నుంచి విదేశాలకు ఈ బియ్యం వెళుతోందన్నారు. మరికొన్ని ముఠాలు స్థానికంగా హోటళ్లకు సైతం రేషన్ బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. రీసైక్లింగ్ కోసం కొందరు మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. అయితే బియ్యం అక్రమ రవాణా కట్టడిలో కేవలం స్థానిక ముఠాలను అరెస్టు చేస్తే లాభం లేదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ అక్రమ రవాణాలో కీలక వ్యక్తులను గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలతో సమాచారం సేకరిస్తున్నామన్నారు.
అక్రమ అధికారులపైనా కొరడా
ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. మల్టీజోన్–2 పరిధిలో ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను, 13 మంది ఎస్సైలను వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. అంతకు ముందు సైతం ఇదే విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేశారు. ఇసుక అంశంలో మాదిరిగానే రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తున్న పోలీసులపై నిఘా విభాగం దృష్టి పెట్టింది. దీంతో అక్రమాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారుల్లో భయం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment