
ఖిల్లాఘనపురం మండలంలోని ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టుకున్న సివిల్ సప్లయ్ డీఎస్‌ఓ అధికారులు
నిఘా నిద్రపోతోంది. పేదల బియ్యం పక్కదారి పడుతోంది. నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.కిలో బియ్యం పథకం జిల్లాలో దళారుల పొట్ట నింపుతోంది. జిల్లాకు చెందిన కొందరు దళారులు రోడ్డు మార్గమే రాచమార్గంగా ఈ బియ్యాన్ని గద్వాల మీదుగా గుట్టుగా సరిహద్దు దాటిస్తున్నారు. ఇంకొందరు జిల్లాలోని రైస్ మిల్లులకు తరలిస్తుండగా ఆ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి అదే బియ్యాన్ని మళ్లీ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఇదే బియ్యం కోళ్ల దాణాగా మారుతోంది. నిఘా నిద్రపోతోంది. పేదల బియ్యం పక్కదారి పడుతోంది. నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.కిలో బియ్యం పథకం జిల్లాలో దళారుల పొట్ట నింపుతోంది. జిల్లాకు చెందిన కొందరు దళారులు రోడ్డు మార్గమే రాచమార్గంగా ఈ బియ్యాన్ని గద్వాల మీదుగా గుట్టుగా సరిహద్దు దాటిస్తున్నారు. ఇంకొందరు జిల్లాలోని రైస్ మిల్లులకు తరలిస్తుండగా ఆ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి అదే బియ్యాన్ని మళ్లీ బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఇదే బియ్యం కోళ్ల దాణాగా మారుతోంది.
సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం దందా బహిరంగ రహస్యంగా సాగుతోంది. గ్రామాల్లో తిరిగి సేకరించిన బియ్యాన్ని నిల్వ ఉంచి రెండ్రోజులకోసారి కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఆటోలు, డీసీఎం, ప్యాసింజర్ ఆటోలు, జీపుల్లో తరలిస్తూ ఉమ్మడి జిల్లాలో ఏదో చోటా నిత్యం పట్టుబడుతూనే ఉన్నారు. గడిచిన మూడు నెలల వ్యవధిలో వేలాది క్వింటాళ్ల బియ్యం పట్టుబడింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ దందా మితిమీరగా స్పందించిన పౌరసరఫరాల అధికారి వనజాత ఆరుగురు డీలర్లపై చర్యలు తీసుకున్నారు.
ఈ–పాస్ వచ్చినా..
గతంలో కొందరు డీలర్లు తమ దుకాణానికి వచ్చిన కోటా నుంచి కొంత బియ్యం మిగుల్చుకునే వారు. ఇంకొందరు పేదలకు ఇవ్వాల్సిన బియ్యంలో సగం కోటా ఇవ్వకుండా దళారులకు విక్రయించి జేబులు నింపుకునే వారు. దళారు లు ఆ బియ్యాన్ని రైస్ మిల్లర్లకు విక్రయించేవారు. మిల్లర్లు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఎవరికీ చిక్కకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించేవారు. అక్రమంగా తరలుతున్న, నిల్వ ఉంచిన బియ్యం ప్రతీరోజు ఏదో చోటా పట్టుబడేది. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బియ్యం నేరుగా లబ్ధిదారులకే చెందేలా ఈ పాస్ (బయోమెట్రిక్ ) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం లబ్ధిదారులు వేలి ముద్రలు వేసి రేషన్‌షాపుల ద్వారా బియ్యాన్ని తీసుకుంటున్నారు.
ఇక్కడివరకు బాగానే ఉంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో డీలర్లు అందించిన రేషన్‌బియ్యాన్ని దళారులు గ్రామాల్లో తిరిగి సేకరించి కిలోకు రూ. 5 నుంచి రూ.7లకు విక్రయిస్తున్నారు. దళారులు ఆ బియ్యాన్ని కిలోకు రూ. 10ల చొప్పున పలు రైస్‌మిల్లుల యజమానులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. మిల్లర్లు అదే బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి, బహిరంగ మార్కెట్లో రూ. 25 నుంచి రూ. 30 చొప్పున అమ్ముతున్నారు. ఇంకొందరు దళారులు బియ్యాన్ని గద్వాల మీదుగా రాయిచూర్‌కు తరలించి అక్కడ రూ.12 నుంచి రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు.
నిఘా వైఫ్యలమే..
పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పక్షంరోజుల వ్యవధిలో బిజినేపల్లి మండలంలో రెండు సార్లు దాడులు నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 150 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బిజినపల్లి కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా పెద్ద ఎత్తున సాగుతున్నా స్ధానిక అధికారులకు సమాచారం లేకపోవడం గమనార్హం. మరోపక్క ఉమ్మడి జిల్లాలో చాలా వరకు బియ్యం వివిధ మార్గాల్లో పోలీసుల తనిఖీల్లోనే పట్టుబడుతుంది. ఇలాంటి సంఘటనలు అక్రమంగా తరలుతున్న బియ్యంపై స్ధానిక అధికారుల నిఘా వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారీ మొత్తంలో బియ్యం ఇతర ప్రాంతానికి తరలుతుంటే అధికారులు మొద్దునిద్ర పోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.