మినీ వ్యాన్ వెనుక రహస్య ప్రదేశంలో రౌండ్ బార్ ముక్కలు
ఉక్కునగరం(విశాఖపట్నం): స్టీల్‌ప్లాంట్‌లో పుష్ప సినిమా తరహా దొంగతనానికి యత్నించిన వ్యక్తి సీఐఎస్‌ఎఫ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి.. స్టీల్‌ప్లాంట్ స్ట్రక్చరల్ మిల్‌లో 56 మిల్లీమీటర్ వ్యాసం కలిగిన రౌండ్ బార్‌లు తయారు చేస్తుంటారు. అలా తయారైన వాటిలో పగుళ్లు, సరైన సైజు లేని వాటిని స్క్రాప్ కింద పక్కన పెడతారు. వాటిని ఎస్‌ఎస్‌డీ విభాగానికి చెందిన కాంట్రాక్టర్ ద్వారా స్టీల్ మెల్ట్‌షాప్‌కు తరలించి రీ మెల్టింగ్ చేస్తారు.
చదవండి: అదే బావి.. నాడు భర్త, నేడు భార్య
గురువారం ఉదయం షిఫ్ట్‌లో సుమారు 6.30 ప్రాంతంలో ఒక మినీ వ్యాను మెయిన్ గేటు అవుట్ గేటు ద్వారా బయటకు వెళ్లడానికి వచ్చింది. అక్కడ తనిఖీ చేస్తున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా వెనుక భాగం అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని తనిఖీ చేయగా షీట్ల కింద సుమారు 40 రౌండ్ బార్ ముక్కలు బయటపడ్డాయి. అవాక్కైన సిబ్బంది వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే గుట్టుగా ఈ వ్యవహారం ఎన్నాళ్లుగా సాగుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన వాహనం నంబర్‌ను చూస్తే అది కూడా ఒరిజినల్ కాదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఉన్న ముఠా బయటపడితేనే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నిందితుడిని, చోరీ సొత్తును స్టీల్‌ప్లాంట్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment