కంటెయినర్లలో తరలిస్తున్న సిగరెట్లు
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న అత్యంత హానికారక సిగరెట్లను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ.6.50 కోట్లు ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు పేర్కొన్నారు. వివరాలు... దుబాయ్‌లో తయారైన మోండ్ బ్రాండ్, ఇంగ్లాండ్‌లో తయారైన బెన్సన్ అండ్ హెడ్జెస్ సిగరెట్లు సిటీకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్‌ఐ అధికారులు కన్నేశారు. ఈ గ్యాంగ్ సిగరెట్లను సముద్రమార్గంలో కంటైనర్ల ద్వారా ముంబైకి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. ఆ కంటెయినర్లలో టేపులు ఉన్నట్లు, దుబాయ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు రికార్డు ల్లో పొందుపరిచినట్లు అనుమానించారు. తాజాగా తిమ్మాపూర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో(ఐసీడీ)కి వచ్చిన ఈ కంటెయినర్లను డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేశారు. 15 లక్షల బెన్సన్ అండ్ హెడ్జెస్, 30.3 లక్షల మోండ్ సిగరెట్లను స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. వీటిలో కొన్ని నకిలీ సిగరెట్లు కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచన మేరకు రాంకీ సంస్థకు చెందిన దుండిగల్ యూనిట్‌లో కస్టమ్స్ అధికారులు మంగళవారం ఆ సిగరెట్లను ధ్వంసం చేశారు.
పన్ను ఎగ్గొట్టడానికే...
ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులకు నష్టం కలిగించే ఈ సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం(కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుండే ఈ సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన పన్ను ఉంటుంది. రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై పన్ను రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ పన్నును ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్‌ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని వీటిని మార్కెట్‌లోకి తరలిస్తున్నారు.
ఇతర దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా తెలియదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి ధ్రువీకరిస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకుండానే విపణిలోకి వెళ్లిపోతున్నాయని అంటున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment