పాతబస్తీలో ప్రైవేట్‌ ‘జూ’లు!  | Pathabasthi People Smuggling Zoo Animals In Hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో ప్రైవేట్‌ ‘జూ’లు! 

Published Thu, Nov 28 2019 7:44 AM | Last Updated on Thu, Nov 28 2019 7:45 AM

Pathabasthi People Smuggling Zoo Animals In Hyderabad - Sakshi

ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్న కృష్ణ జింకను చూపిస్తున్న కొత్వాల్‌

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో జూ ఎక్కడ? అంటే.. బహదూర్‌పురాలో ఉన్న నెహ్రూ జులాజికల్‌ పార్కు అని ఠక్కున చెబుతారు. అయితే, ఇప్పటి వరకు రికార్డుల్లోకి ఎక్కకుండా, గుట్టచప్పుడు కాకుండా పాతబస్తీలో ‘ప్రైవేట్‌ జూ’లు కూడా నడుస్తున్నాయి. గడిచిన పది రోజుల్లో ఏడు వన్యప్రాణులను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకోవడమే దీనికి నిదర్శనం. జనాల్లో ఉన్న మూఢ నమ్మకాలు, ఫ్యాషన్, మాంసానికి ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో ఈ జూలు ఇలా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

వరుసగా చిక్కుతున్న జంతువులు 
ఈ వన్యప్రాణుల దందా పాతబస్తీ కేంద్రంగా కొన్నేళ్లుగా సాగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. శివారు జిల్లాలు, పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ జంతువుల్ని అక్రమంగా తీసుకువస్తున్నారు. అక్కడి వేటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న అక్రమ వ్యాపారులు వీటిని సమీకరిస్తున్నారు. ఆపై బోనుల్లో బంధించి రోడ్డు మార్గంలో తీసుకొస్తున్నారు. రహదారుల్లో ఉంటున్న చెక్‌పోస్టులు, అటవీ శాఖ తనిఖీ కేంద్రాలనూ వీరు దాటి వచ్చేస్తున్నారంటే మామూళ్ల మత్తులో ఆ సిబ్బంది పరోక్షంగా సహకరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. నగరానికి చేరుకున్న తర్వాత తమ ఇళ్లు, ఫామ్‌హౌస్‌లు, దుకాణాల్లో ఈ జంతువుల్ని కొంతకాలం పెంచి ఆపై అసలు ‘పని’ ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.  

ఈ మూడే ప్రధాన కారణాలు 
ఇతర ప్రాంతాల నుంచి సిటీకి గుట్టుగా, వ్యవస్తీకృతంగా ఈ వన్యప్రాణుల అక్రమ దందా సాగడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. పాతబస్తీకి చెందిన వారి కుటుంబీకులు అనేక మంది దుబాయ్‌ వంటి దేశాల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి వారు తరచు అక్కడకు వెళ్లి వస్తుంటారు. ఆయా దేశాల్లో పులులతో సహా కొన్ని వన్యప్రాణుల్ని ఇళ్లల్లో పెంచుకోవడం సరదా. అక్కడిలాగే ఇక్కడా వన్యప్రాణులను పెంచాలని కొందరు ప్రయతి్నస్తున్నారు. మరికొందరికి ఈ తరహా వన్యప్రాణుల్ని పెంచుకుంటే, సజీవంగా పాతిపెడితే, నిరీ్ణత రోజుల్లో బలి ఇస్తే అదృష్టం వరిస్తుందనే మూఢనమ్మకం ఉంది. దీన్ని వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. వీటితో పాటు కొన్ని జంతువుల మాంసానికి ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో వన్యప్రాణుల అక్రమ రవాణా య«థేచ్ఛగా సాగుతోందని పోలీసులు వివరిస్తున్నారు.

‘అంతర్జాతీయ’ ప్రమేయంపై అనుమానాలు 
వన్యప్రాణుల అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ ముఠాల ప్రమేయం సైతం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా తీసుకెళ్లిన వన్యప్రాణుల్లో నక్షత్ర తాబేళ్లు వంటి వాటిని పాతబస్తీతో పాటు శివార్లలోని ఫామ్‌హౌస్‌ల్లో కొంతకాలం ఉంచుతున్నారని, ఆపై బయటి దేశాలకు తరలించేస్తున్నారని భావిస్తున్నారు. ఈ కోణంలో అటవీ, కస్టమ్స్‌ అధికారులతో కలిసి ఆరా తీయాలని నిర్ణయించారు. ఈ దందా చేస్తున్న వాళ్లంతా ఏళ్లుగా పక్షులు, కుందేళ్లను విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్టమర్లు, వేటగాళ్లు, ఇతర వ్యాపారులతో ఏర్పడిన పరిచయాల నేపథ్యంలో వీరంతా వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలోకి దిగారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు నిఘా ముమ్మరం చేయడంతో పాటు అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేయాలని నిర్ణయించారు.  

స్మగ్లింగ్‌కు ఉదాహరణలు.. 

  • పాతబస్తీలోని కాలాపత్తర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ సహా ఐదుగురు నగరవాసులు అరుదైన కరకల్, లెపార్డ్‌ జాతులకు చెందిన పిల్లులు ఐదింటిని బీహార్‌ అడవుల్లో పట్టుకున్నారు. వీటిని కారులో ప్రత్యేకంగా రూపొందించిన బోనుల్లో సిటీకి తీసుకువస్తూ 2017 జనవరిలో మీర్జాపూర్‌ ప్రాంతంలో అక్కడి అటవీ శాఖ అధికారులకు దొరికారు. 
  • పాతబస్తీలోని బార్కస్‌కు చెందిన అన్నదమ్ములు సాలెహ్‌ బిన్‌ మహ్మద్‌ బదామ్, అలీ బిన్‌ మహ్మద్‌ బదామ్‌లు ఈశాన్య రాష్ట్రాల్లో దొరికే నాలుగు స్లోలోరిస్‌లు, ఓ స్టార్‌ తాబేలు, మరో మొత్తడి డొప్ప తాబేలును విక్రయానికి ప్రయతి్నంచారు. ఓ నిందితుడిని ఈ నెల 17న దక్షిణ మండల టాస్‌్కఫోర్స్‌ పట్టుకుంది. 
  • వనసర్తి జిల్లా పెబ్చేర్‌లోని కృష్ణా నది ఒడ్డున పట్టుకున్న కృష్ణ జంకను బహ దూర్‌పురాలోని కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అన్వర్‌ అలీ, మహ్మద్‌ జావేద్‌ సిటీకి తీసుకొచ్చారు. కేజీ రూ.3 వేల చొప్పున దీని మాంసం విక్రయించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ వీరికి చెక్‌ చెప్పింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement