సాక్షి, అమరావతి: అక్రమ మద్యం, పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్‌ను అరికట్టే లక్ష్యంతో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది. పేద ప్రజలు వినియోగించే మద్యం ధరలను తగ్గిస్తూ గత నెలలోనే ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆదాయం కాదు.. ఆరోగ్యమే ముఖ్యం
మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరిచి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులను రద్దు చేసింది. పర్మిట్ రూంలను తొలగించింది. ఆదాయాన్ని పట్టించుకోకుండా రిటైల్ అవుట్‌లెట్లను 4,380 నుంచి 2,934కి కుదించింది. మద్యం లభ్యతను తగ్గించేందుకే 33 శాతం షాపులను తగ్గించింది. బార్లను 40 శాతం తగ్గించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. మద్యం/మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించేందుకు మద్య నిషేధ ప్రచార కమిటీని నియమించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
‘పొరుగు’ నుంచి స్మగ్లింగ్..
రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గతేడాది అక్టోబరు 1 నుంచి ధరలు క్రమంగా పెంచుకుంటూ వెళ్లింది. కోవిడ్ సమయంలో మద్యం వినియోగాన్ని నియంత్రించేందుకు ధరలు 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మద్యం వినియోగం రాష్ట్రంలో భారీగా తగ్గింది. అయితే మద్యానికి అలవాటైన కొందరు మిథైల్ ఆల్కహాల్, శానిటైజర్లను ఆశ్రయించారు. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక నుంచి ఏపీలోకి పెద్ద ఎత్తున మద్యం స్మగ్లింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీటిపై సమీక్షించిన ప్రభుత్వం.. శానిటైజర్లు తాగి పేదలు ప్రాణాలు కోల్పోతుండటం, స్మగ్లింగ్‌ను నిరోధించే దిశగా చీప్ లిక్కర్, బీరు, రెడీ టు డ్రింక్ కేటగిరీల ధరలు తగ్గిస్తూ గత నెల 3న నిర్ణయం తీసుకుంది.
ఎస్‌ఈబీ నివేదికతో ధరల సవరణ..
- ఈ ఏడాది మే నుంచి ఏపీలోకి అక్రమ మద్యం ప్రవాహం పెరిగింది. దీని ప్రభావంపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనికి ప్రధాన కారణం పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉండటమేనని ఎస్‌ఈబీ నివేదించింది.
- ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 వరకు నెల రోజుల వ్యవధిలో అక్రమ మద్యం రవాణా కేసులు 1,211 నమోదు కావడం గమనార్హం. తెలంగాణ నుంచి 630, కర్నాటక నుంచి 546 , ఒడిషా నుంచి 24, తమిళనాడు నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా 11 కేసులు నమోదయ్యాయి.
- గత నెలలో ఏపీలో చీప్ లిక్కర్ ధరలు తగ్గించిన తర్వాత రాష్ట్ర సరిహద్దు మండలాల్లో చౌక మద్యం అక్రమ రవాణా గణనీయంగా తగ్గిందని ఎస్‌ఈబీ పేర్కొంది.
- ఇదే సమయంలో ప్రీమియం, మీడియం బ్రాండ్ల స్మగ్లింగ్ భారీగా పెరిగింది. ఈ కేటగిరీల బ్రాండ్ల ధరలను హేతుబద్ధీకరిస్తే అక్రమ రవాణాకు తెర పడుతుందని ఎస్‌ఈబీ నివేదించింది. ఈ నేపథ్యంలో ఈ బ్రాండ్ల ధరలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన ధరల ప్రకారం మీడియం, ప్రీమియం బ్రాండ్లపై రూ.50 నుంచి రూ.1,350 వరకు ధరలు తగ్గాయి.
స్మగ్లింగ్‌ను అరికట్టేందుకే మద్యం ధరల సవరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ, కర్నాటకలో మద్యం ధరలు రెండింతలు తక్కువ కావడంతో అక్కడ నుంచి రాష్ట్రంలోకి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రీమియం, మీడియం బ్రాండ్ల ధరలు సవరించామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) నివేదిక ప్రకారం మద్యం ధరలు సవరించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment