
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దావూద్ ఇబ్రహీం ముఠా ప్రమేయం ఉండచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టుకు వివరించింది. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని జాతి వ్యతిరేక, ఉగ్ర కార్యకలాపాలకు వెచ్చిస్తున్నారని నిఘా వర్గాలు సమాచారం అందించాయని కోర్టుకు ఎన్‌ఐఏ తెలిపింది. దౌత్య మార్గాల ద్వారా గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఈ కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వరాదని న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేసింది. నిందితులకు ఉన్నతస్ధాయి దౌత్య వర్గాలతో ఉన్న సంబంధాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎన్‌ఐ ప్రత్యేక న్యాయస్దానానికి నివేదించింది.
నిందితుల్లో ఒకరైన రమీస్ తాను టాంజానియాలో డైమండ్ వ్యాపారం చేస్తానని, ఆ బంగారాన్ని తాను దుబాయ్‌లో విక్రయించానని తెలిపాడని ఎన్‌ఐఎ వివరించింది. దావూద్ ఇబ్రహీంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ దావూద్ ఇబ్రహీం ఆగడాలపై వెల్లడించిన వివరాలతో పాటు ఆఫ్రికాలో దావూద్ ముఠా కార్యకలాపాలపై అమెరికా ట్రెజరీ విభాగం ప్రచురించిన ఫ్యాక్ట్ షీట్ వివరాలను ఎన్‌ఐఎ ప్రత్యేక న్యాయస్ధానానికి వివరించింది. చదవండి : లేటు వయసులో దావూద్ ఘాటు ప్రేమ!