సాక్షి, అమరావతి: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌కు విజయవాడ గేట్‌వేగా మారిందన్న సమాచారం కలకలం సృష్టిస్తోంది. ఏకంగా రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్‌తో విజయవాడలోని ఓ వ్యాపార సంస్థకు సంబంధాలున్నాయన్న విషయం విస్మయం కలిగిస్తోంది. కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లోని ముండ్రా పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో తీగ లాగితే విజయవాడలో డొంక కదలింది.
టాల్కం పౌడర్ కాదు..హెరాయిన్
అఫ్గానిస్తాన్ నుంచి గుజరాత్‌లోకి హెరాయిన్‌ను స్మగ్లింగ్ చేశారని కేంద్ర డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దాంతో గుజరాత్‌లోని ముండ్రా పోర్టులో తనిఖీలు నిర్వహించగా.. భారీ పరిమాణంలో హెరాయిన్‌ను గుర్తించారు. టాల్కం పౌడర్ పేరుతో ఉన్న భారీ కన్‌సైన్‌మెంట్‌ను తెరచి చూడగా.. అందులో భారీస్థాయిలో హెరాయిన్ ఉండటం విస్మయపరిచింది. కాందహార్‌లోని ‘హాసన్ హుస్సేన్ లిమిటెడ్’ అనే వ్యాపార సంస్థ నుంచి ‘టాల్కం పౌడర్’ పేరుతో ఆ హెరాయిన్‌ను దిగుమతి చేసుకున్నారు. తొలుత ఆ హెరాయిన్ విలువ రూ.2,500 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేయగా.. దాని విలువ ఏకంగా రూ.9 వేల కోట్లుగా నిర్ధారించారు. ఇంతకీ ఆ హెరాయిన్‌ను ఎవరు దిగుమతి చేశారని దర్యాప్తు చేయగా... విజయవాడలోని లింకులు బయటపడ్డాయి.
పోలీసుల అదుపులో నలుగురు
విజయవాడలోని అషీ ట్రేడింగ్ కంపెనీ అఫ్గానిస్తాన్ నుంచి హెరాయిన్‌ను దిగుమతి చేసుకుందని కన్‌సైన్‌మెంట్ రికార్డుల్లో ఉంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడలోని గడియారం వీధిలోని అషీ ట్రేడింగ్ కంపెనీని గుర్తించారు. ఆ కంపెనీ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచా రణ చేపట్టారు. కాగా, వారు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. తమది కేవలం ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం మాత్రమేనని.. గుజరాత్‌లో డీఆర్‌ఐ అధికారులు జప్తు చేసిన హెరాయిన్‌తో తమకు సంబంధంలేదని చెప్పినట్లు సమాచారం.
దక్షిణాది రాష్ట్రాలకు తరలించేందుకే..
ఆ హెరాయిన్‌ను గుజరాత్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు తరలించనున్నారన్నది పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. కాగా, స్మగ్లింగ్ రాకెట్ అసలు ప్రణాళిక ఏమిటన్న దానిపై పోలీసులు ఇతమిత్థంగా ఇంకా ఓ అంచనాకు రాలేదు. గుజరాత్ నుంచి విజయవాడ తీసుకువచ్చి ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తారా లేక విజయవాడతో సంబంధం లేకుండా నేరుగా గుజరాత్ నుంచి చెన్నై తరలించాలన్నది స్మగ్లర్ల ప్రణాళికా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అషీ ట్రేడింగ్ కంపెనీ పేరును మాత్రమే స్మగ్లింగ్ రాకెట్ వాడుకుంటోందా అన్న దాంట్లో వాస్తవం ఎంతన్నది అంతుబట్టడం లేదు. ప్రస్తుతానికి అషీ ట్రేడింగ్ కంపెనీకి చెం దిన ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సింథటిక్ డ్రగ్స్‌ను ఆన్‌లైన్ ద్వారా తె ప్పించి విక్రయిస్తున్న ముఠాను గుంటూరు పో లీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అం తలోనే రూ.9వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్‌లో విజయవాడ కేంద్ర బిందువుగా ఉందని తెలియడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ దందాపై పోలీస్, డీఆర్‌ఐ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవ ని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. హెరాయిన్ స్మగ్లింగ్ వ్యవహారంలో విజయవాడ లింకులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇదే అంశంపై విజయవాడలోని కేంద్ర డీఆర్‌ఐ డిప్యూటీ డైరెక్టర్ టి.రాజీవ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment