వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారిణి గీతా రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతులను లక్ష్యంగా చేసుకొని అనధికార హెర్బిసైట్ టొలరెంట్(హెచ్‌టీ) పత్తి విత్తనాలను బ్రాండెడ్ పత్తి విత్తనాల కంటే తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధమైన ఇద్దరు వ్యక్తులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి శుక్రవారం అరెస్టు చేశారు. గుజరాత్ నుంచి రైల్వే (కార్గో) సర్వీసు ద్వారా వచ్చిన ఈ అనధికార పత్తి విత్తనాలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవుట్‌వార్డ్ పార్శిల్ కార్యాలయం నుంచి టాటా ఏస్ వాహనంలో తరలించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రూ.32,52,110 విలువైన 2005 కిలోల బీజీ–3 (హెర్బిసైడ్ టొలరెంట్) విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సిటీ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు.
అగ్రికల్చర్ డిప్లోమో చేసి అడ్డదారి...
కరీంనగర్ పట్టణానికి చెందిన రావుల రజినీకాంత్ అగ్రికల్చర్ డిప్లోమోతో పాటు ఎంబీఏ పూర్తి చేశాడు. అనంతరం ఓ పెస్టిసైడ్‌లో కంపెనీలో పనిచేసిన అతను విత్తనాల విక్రయాలు, కొనుగోళ్లపై అవగాహన పెంచుకున్నాడు. ఈ అనుభవంతో 2003లో అబిడ్స్‌లోని లెనిన్ ఎస్టేట్స్‌లో ‘ఓంకార్ అగ్రిటెక్’ పేరుతో సొంతంగా కంపెనీ ప్రారంభించాడు. 2009లో కంపెనీ పేరును ఓంకార్ సీడ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చి కొత్తపేటలోని ఓంకార్ నిలయానికి కార్యాలయాన్ని మార్చాడు. యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం, కీసరమ్ రోడ్డులో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన అతను విత్తనాల ప్రాసెసింగ్, ప్యాకింగ్ సీడ్ స్టోరేజీ యూనిట్‌ను నెలకొల్పాడు. దీంతో పాటు ‘సేద్య పొలం అగ్రికల్చర్’ మేగజైన్ నడుపుతున్నాడు.
ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్రణాళిక రూపొందించాడు. ఇందులో భాగంగా 2019 ఖరీఫ్ సీజన్ కోసం అనధికారిక హెచ్‌టీ పత్తి విత్తనాలను విక్రయాలు చేపట్టాలని భావించిన అతను గుజరాత్ గాంధీనగర్‌లోని ‘అవిరాట్ అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నిర్వాహకుడు భరత్ పటేల్‌ను సంప్రదించాడు. కిలోకు రూ.500 చొప్పున పత్తి విత్తనాలకు భారీగా కొనుగోలు చేసి అహ్మదాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు రైల్వే కార్గో ద్వారా తెప్పించాడు. అక్కడి నుంచి కీసరం రోడ్డులో ఉన్న తన ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలించి 450 గ్రాముల పత్తి విత్తనాలను ప్యాక్ చేసి సబ్ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్లకు రూ.730 చొప్పునపంపిణీ చేయాలని నిర్ణయించాడు. అయితే అహ్మదాబాద్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఎటువంటి ఇన్‌వాయిస్ బిల్లులు, డెలివరి చలాన్ లేకుండా సంబంధిత అధికారుల అనుమతి లేకుండా 50 గన్నీ బ్యాగ్‌ల్లో పత్తి విత్తనాలు వచ్చినట్లు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించిన అధికారులు టాటా ఏస్‌లో లోడ్ చేసిన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రావుల రజనీకాంత్‌తో పాటు ఆటో డ్రైవర్ బండారి మహేష్‌ను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును గోపాలపురం పోలీసులకు అప్పగించారు.
పర్యావరణానికి ప్రమాదకరం...
సాగు భూమితో పాటు, పర్యావరణంతో పాటు మానవళికి ప్రమాదకరమైన ఈ హెచ్‌టీ పత్తి విత్తనాలకు జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైసల్ కమిటీ అనుమతి ఇవ్వలేదు. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనలను అతిక్రమించారని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారి గీతా రెడ్డి అన్నారు. ఎంఆర్‌పీ లేకుండా, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీలు లేకుండా అక్రమంగా రవాణా చేసుకుని ఎక్కువ ధరకు రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులు కూడా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ తరఫున రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీజీ–3లో వచ్చే కలుపు నివారణకు గ్లైపోసేట్ అనే ప్రమాదకరమైన పురుగుమందును వాడాల్సి ఉంటుందన్నారు. దీని వల్ల కేన్సర్ వచ్చే ప్రమా దం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్ధారించిందన్నారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు, నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేఎస్ రవి, శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర రెడ్డి, గోపాలపురం ఇన్‌స్పెక్టర్ ఎం.నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment