అండర్–19 ప్రపంచ బాక్సింగ్
న్యూఢిల్లీ: అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ క్రిష వర్మ పసిడి పతకంతో సత్తా చాటింది. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో కొలరాడో వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణంతో పాటు ఐదు రజత పతకాలు దక్కాయి. తొలి సారి నిర్వహించిన ఈ చాంపియన్‌షిప్ మహిళల 75 కేజీల విభాగంలో క్రిష వర్మ విజేతగా నిలిచింది. తుది పోరులో క్రిష 5–0 పాయింట్ల తేడాతో సిమోన్ లెరికా (జర్మనీ)పై గెలుపొందింది.
మహిళల విభాగంలో చంచల్ చౌదరీ (48 కేజీలు), అంజలీ కుమారి సింగ్ (57 కేజీలు), విని (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) ఫైనల్స్‌లో ఓడి రజత పతకాలు దక్కించుకోగా... పురుషుల విభాగంలో రాహుల్ కుందు (75 కేజీలు) తుదిపోరులో తడబడి రజతానికి పరిమితమయ్యాడు.
మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో చంచల్ చౌధరీ 0–5తో మియా టియా ఆటోన్ (ఇంగ్లండ్) చేతిలో... 70 కేజీల ఈవెంట్‌లో ఆకాంక్ష 1–4తో లిలల్లీ డెకాన్ (ఇంగ్లండ్) చేతిలో ఓడగా... 60 కేజీల విభాగంలో విని 2–3తో ఎల్లా లాన్స్‌డలె (ఇంగ్లండ్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 75 కేజీల విభాగంలో రాహుల్ కుందు 1–4తో అవినోంగ్య జోసెఫ్ (అమెరికా) చేతిలో ఓడాడు.
శనివారం పోటీల్లో మొత్తం ఆరుగురు భారత బాక్సర్లు పాల్గొనగా అందులో ఒకరు గెలిచి ఐదుగురు ఓటమి పాలయ్యారు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment