తెలుగమ్మాయి.. తొలిపతకం తెచ్చింది!
భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. విలువిద్యలో మహిళల విభాగంలో భారత దేశానికి మొట్టమొదటి పతకాన్ని అందించారు. ఈ విజయంలో మన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ పాత్ర చాలా ఉంది. విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి పతకం అందించిందంటూ ఆమె తండ్రి సురేంద్ర కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇంచియాన్లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌంట్ టీమ్ ఈవెంట్లో భారత జట్టుకు కాంస్య పతకం వచ్చింది. జ్యోతి సురేఖతో పాటు త్రిషా దేవ్, పూర్వాషా సుధీర్ షిండే ఈ జట్టులో ఉన్నారు.
సెమీ ఫైనల్స్ మ్యాచ్లో చైనా జట్టు చేతిలో ఓడిపోయిన భారత జట్టు.. కాంస్య పతకం పోరులో మాత్రం ముందంజ వేసింది. ఇరాన్ జట్టుతో తలపపడిన భారత అమ్మాయిలు 224 పాయింట్లు స్కోర్ చేయగా, ఇరాన్ జట్టు మాత్రం 217కే పరిమితం అయ్యింది. ఈ విభాగంలో స్వర్ణపతకాన్ని దక్షిణ కొరియా జట్టు సాధించింది. ఫైనల్ పోటీలో చైనా జట్టును 229-226 పాయింట్ల తేడాతో ఓడించింది. చైనాకు రజత పతకం వచ్చింది. కాంపౌండ్ ఆర్చరీ అనే పోటీ తొలిసారిగా ఈ ఆసియా క్రీడల్లోనే మొదలైంది.