asiad games 2014
-
కాంస్య పతకం మళ్లీ అందుకున్నసరితా దేవి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ సరితా దేవి కాంస్య పతక వివాదం ముగిసింది. అప్పట్లో పతకం తీసుకునేందుకు నిరాకరించిన సరితా దేవి మనసు మార్చుకుంది. వెనక్కు ఇచ్చేసిన పతకాన్ని సరిత భారత ఒలింపిక్ సంఘం నుంచి మళ్లీ తీసుకుంది. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్ సందర్భంగా సెమీఫైనల్స్‌లో వివాదాస్పద రీతిలో ఓడిపోయిన సరితాదేవి కాంస్య పతకం తీసుకునేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. పోడియం మీద కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. తన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసింది. సెమీఫైనల్స్‌లో మ్యాచ్‌లో జడ్జీలు సరితా దేవి ఓడిపోయినట్టు ప్రకటించడం వివాదాస్పదమైంది. సరిత పతకం వేసుకోడానికి కూడా నిరాకరించి.. దాన్ని రజతపతకం సాధించిన జీనా పార్క్కే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన చూసి షాకైన జీనా పార్క్.. ఏం చేయాలో తెలియక పోడియం మీదే కాంస్య పతకం వదిలేసి అక్కడినుంచి ఆమె కూడా వెళ్లిపోయింది. దాంతో నిర్వాహకులు కాంస్యపతకాన్ని తమవద్దే ఉంచుకున్నారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాఖ్య భావించింది. ఆ తర్వాత రాజీమార్గంతో వ్యవహరించడం, తాజాగా సరిత పతకం తీసుకోవడంతోఈ వివాదం ముగిసినట్టయ్యింది. -
బాక్సర్ సరితాదేవికి హెచ్చరికతో సరి
ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని నిరాకరించి, దాన్ని రజత పతక విజేత కొరియన్ అమ్మాయి మెడలో వేసేసి వెళ్లిపోయినందుకు ఆమెను తీవ్రంగా హెచ్చరించి వదిలేశారు. తాను క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆమె క్షమాపణ చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఊరుకున్నారు. పతకాల ప్రదానోత్సవంలో సరితాదేవి ప్రవర్తన పట్ల తాము ఏమాత్రం సంతృప్తి చెందలేదని అన్నారు. అయితే ఆమె క్షమాపణ చెప్పడం, అది కావాలని జరిగిన సంఘటన కాదని భారత బృందం కూడా తెలియజేయడంతో హెచ్చరించి వదిలేయాలని నిర్ణయించామని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా (ఓసీఏ) తెలిపింది. ఈ విషయాన్ని ఓసీఏ గౌరవ జీవితకాల ఉపాధ్యక్షుడు వీ జిఝాంగ్ తెలిపారు. భారత బృందానికి దీంతో ఏమాత్రం సంబంధం లేదని, అది కేవలం ఒక్క అథ్లెట్ చేసిన పొరపాటని తాము భావిస్తున్నామన్నారు. -
అనుకోని అదృష్టం: మంజుబాలకు రజతం
భారత హేమర్ త్రో క్రీడాకారిణి మంజుబాలకు అనుకోని అదృష్టం కలిసొచ్చింది. ఆసియా క్రీడల్లో ఆమె తొలుత కాంస్య పతకం గెలుచుకుంది. అయితే.. ఈ పోటీలో స్వర్ణపతకం సాధించిన చైనా క్రీడాకారిణి ఝాంగ్ వెంజియు డ్రగ్స్ వాడినట్లు డోప్ టెస్టులో తేలడంతో ఆమె నుంచి పతకం వెనక్కి తీసుకున్నారు. జెరనాల్ అనే నిషేధిత డ్రగ్‌ను ఆమె వాడినట్లు డోప్ టెస్టులో తేలింది. దీంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తూ ఆమెకు ఇచ్చిన స్వర్ణపతకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా ప్రకటించింది. తొలుత ఈ పోటీలో రజత పతకం సాధించిన చైనా క్రీడాకారిణి వాంగ్ ఝెంగ్ ఇప్పుడు స్వర్ణపతకం సాధించింది. ఇంతకుముందు కాంస్యం సాధించిన మంజుబాలకు ఇప్పుడు రజతం లభించింది. -
ఎనిమిదో స్థానంలో భారత్
ఉత్సాహంగా జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారతదేశం ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇంచియాన్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో మూడు నాలుగు రోజుల ముందువరకు భారత క్రీడాకారుల ఆటతీరు పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా వరుసపెట్టి స్వర్ణపతకాలు సాధిస్తూ క్రమంగా పతకాల పట్టికలో దేశం స్థానాన్ని పైకి తీసుకొచ్చారు. భారత దేశానికి ఇప్పటివరకు 11 స్వర్ణ పతకాలు, 10 రజత పతకాలు, 36 కాంస్య పతకాలు వచ్చాయి. మొత్తం 57 పతకాలు భారత ఖాతాలో పడ్డాయి. ఉత్తర కొరియా జట్టుకు 11 స్వర్ణాలు వచ్చి మొత్తం 36 పతకాలే ఉన్నా, రజత పతకాలు మాత్రం మనకంటే ఒకటి ఎక్కువగా 11 రావడంతో ఆ దేశం ఏడో స్థానంలో ఉంది. 149 స్వర్ణ పతకాలు, 107 రజత పతకాలు, 81 కాంస్య పతకాలు కలిపి మొత్తం 337 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా, జపాన్ దేశాలు 228, 195 పతకాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత జట్టు హాకీ, కబడ్డీ పోటీలలో స్వర్ణపతకాలు సాధించడంతో తన స్థానాన్ని మెరుగు పరుచుకోగలిగింది. -
హాకీ జట్టుకు ఉపరాష్ట్రపతి అభినందనలు
ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి భారత కీర్తి పతాకాన్ని వినువీధిలో సగర్వంగా ఎగరేసిన హాకీ జట్టును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభినందించారు. ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం భారతీయులందరూ గర్వపడేలా చేసిందని, భవిష్యత్తులో కూడా హాకీని జాతీయ క్రీడగా గుర్తించేందుకు తగిన వనరులు, మంచి ప్రయత్నాలు జరిగేందుకు దోహదపడుతోందని ఆయన అన్నారు. విజయం సాధించిన హాకీ జట్టు సభ్యులకు అన్సారీ అభినందనల సందేశాన్ని పంపారు. విజయదశమి ఉత్సవాలకు తోడు హాకీ సంబరాలు కూడా భారతదేశంలో జరుగుతున్నాయని, ఈ విజయంలో మీ మీ కుటుంబ సభ్యులతో పాటు యావద్దేశం చేతులు కలుపుతుందని ఆయన అన్నారు. -
ఏడుస్తూ.. పతకం తిరిగిచ్చేసిన బాక్సర్ సరిత
ఆసియా క్రీడల్లో ఎప్పుడూ లేనంత ఉద్విగ్నత బుధవారం కనిపించింది. సెమీఫైనల్స్‌లో వివాదాస్పద రీతిలో ఓడిపోయిన భారత బాక్సర్ సరితాదేవి అధికారులకు, ప్రేక్షకులకు కూడా షాకిచ్చింది. పోడియం మీద కన్నీరు మున్నీరుగా విలపించి.. తన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసింది. సెమీఫైనల్స్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కొరియా బాక్సర్ గెలిచినట్లు జడ్జీలు ప్రకటించడంతో సరితాదేవి, ఆమె భర్త కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సరితపై నెగ్గినట్లు ప్రకటించిన జీనా పార్క్ ఫైనల్లో ఓడిపోయి రజత పతకం సాధించింది. వాస్తవానికి సెమీస్ బౌట్లో సరితాదేవి పూర్తి ఆధిక్యం కనబర్చింది. అయినా కూడా జీనాపార్క్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పీల్ చేసినా పట్టించుకోలేదు. దాంతో పోడియం మీదకు పిలిచినప్పటినుంచి సరితాదేవి ఏడుస్తూనే ఉంది. అసలు పతకం వేసుకోడానికి కూడా నిరాకరించి.. దాన్ని రజతపతకం సాధించిన జీనా పార్క్కే ఇచ్చేసింది. ఇంతకుముందు ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు కూడా గెలిచిన సరితాదేవి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన చూసి షాకైన జీనా పార్క్.. ఏం చేయాలో తెలియక పోడియం మీదే కాంస్య పతకం వదిలేసి అక్కడినుంచి ఆమె కూడా వెళ్లిపోయింది. దాంతో నిర్వాహకులు కాంస్యపతకాన్ని తమవద్దే ఉంచుకున్నారు. ఒకటిన్నర సంవత్సరాల బాబును కూడా తాను వదిలిపెట్టి కఠోరమైన శిక్షణ తీసుకున్నానని, చివరకు తన కొడుకు కూడా ఒకదశలో తనను గుర్తుపట్టలేదని సరితాదేవి వాపోయింది. తనకు ఆ పతకం అక్కర్లేదు కాబట్టే దాన్ని కొరియన్లకు ఇచ్చేశానని చెప్పింది. దీని తర్వాత వచ్చే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. -
ఫిక్సింగ్ వల్లే బాక్సింగ్‌లో ఓటమి?
ఆసియా క్రీడల్లో కొత్త వివాదం మొదలైంది. ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ సరితాదేవి సెమీ ఫైనల్స్‌లో అద్భుతంగా పోరాడినా.. ఆమెను ఓడిపోయినట్లు ప్రకటించారని, దీని వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఈ బౌట్లో తాను పూర్తి ఆధిపత్యం కనబర్చినా, చివరకు జడ్జిలు మాత్రం దక్షిణ కొరియాకు చెందిన జీనా పార్క్ గెలిచినట్లు ప్రకటించడంతో సరితాదేవి కూడా ఆగ్రహానికి గురైంది. ఇది చాలా అనాగరికమైన నిర్ణయమని సరిత భర్త తోయిబా సింగ్ అన్నారు. ఇలాగే తమకు కూడా అన్యాయం జరిగిందంటూ మంగోలియా జట్టు ఫిర్యాదు చేసిన తర్వాత భారత జట్టుకూడా ఫిర్యాదుచేసింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య దక్షిణ కొరియా ఆధిపత్యంలో ఉంటుంది. అందుకే ఇలా జరిగిందని అంటున్నారు. ఇక మన బాక్సింగ్ సంఘాల విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో చివరకు కొత్తగా బాక్సింగ్ ఇండియా అనే సంస్థను అమెచ్యూర్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ ఏర్పాటుచేయించింది. సరితాదేవి బౌట్‌ను సమీక్షించాలంటూ ఆమె భర్తతో పాటు టీమ్ కోచ్ సాగర్ ధైయ్యా కూడా ఫిర్యాదుచేశారు. ఇందుకోసం 500 డాలర్ల ప్రొటెస్ట్ ఫీజు కూడా కట్టారు. బాక్సింగ్‌లో భారత్‌కు తాము అనేక పతకాలు తెస్తున్నామని, అయినా జట్టు యాజమాన్యం మాత్రం నిరసన విషయంలో తమకు అండగా ఉండట్లేదని సరితాదేవి వాపోయింది. ఈశాన్య ప్రాంతాలకు చెందినవాళ్లు భారతీయులు కారా అని ఆమె నిలదీసింది. సరితకు జరిగిన అన్యాయం విషయంలో మేరీ కోమ్ కూడా నిరసన వ్యక్తం చేసింది. ప్రత్యర్థి కొరియా బాక్సర్ కావడం వల్లే సరిత ఓడిపోయినట్లు ప్రకటించారని, ఇది చాలా దారుణమని మేరీకోమ్ వ్యాఖ్యానించింది. -
భారత ఆర్చరీ జట్టుకు స్వర్ణపతకం
-
తెలుగమ్మాయి.. తొలిపతకం తెచ్చింది!
-
తెలుగమ్మాయి.. తొలిపతకం తెచ్చింది!
భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. విలువిద్యలో మహిళల విభాగంలో భారత దేశానికి మొట్టమొదటి పతకాన్ని అందించారు. ఈ విజయంలో మన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ పాత్ర చాలా ఉంది. విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి పతకం అందించిందంటూ ఆమె తండ్రి సురేంద్ర కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌంట్ టీమ్ ఈవెంట్లో భారత జట్టుకు కాంస్య పతకం వచ్చింది. జ్యోతి సురేఖతో పాటు త్రిషా దేవ్, పూర్వాషా సుధీర్ షిండే ఈ జట్టులో ఉన్నారు. సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో చైనా జట్టు చేతిలో ఓడిపోయిన భారత జట్టు.. కాంస్య పతకం పోరులో మాత్రం ముందంజ వేసింది. ఇరాన్ జట్టుతో తలపపడిన భారత అమ్మాయిలు 224 పాయింట్లు స్కోర్ చేయగా, ఇరాన్ జట్టు మాత్రం 217కే పరిమితం అయ్యింది. ఈ విభాగంలో స్వర్ణపతకాన్ని దక్షిణ కొరియా జట్టు సాధించింది. ఫైనల్ పోటీలో చైనా జట్టును 229-226 పాయింట్ల తేడాతో ఓడించింది. చైనాకు రజత పతకం వచ్చింది. కాంపౌండ్ ఆర్చరీ అనే పోటీ తొలిసారిగా ఈ ఆసియా క్రీడల్లోనే మొదలైంది. -
భారత ఆర్చరీ జట్టుకు స్వర్ణపతకం
ఆసియా క్రీడలు ప్రారంభమైన ఇన్నాళ్ల తర్వాత మళ్లీ భారత జట్టుకు మరో స్వర్ణపతకం వచ్చింది. మొట్టమొదటి సారిగా ఆర్చరీ విభాగంలో భారత పురుషుల జట్టు ఈ ఘనతను సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోటీలో దక్షిణ కొరియ జట్టును 227-225 స్కోరు తేడాతో ఓడించింది. ఈ స్వర్ణపతకంతో భారతజట్టు పతకాల పట్టికలో కొం పైకి ఎగబాకే అవకాశం వచ్చింది. దీంతో కలిపి 17వ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ కు రెండే స్వర్ణాలు లభించాయి. మరోవైపు భారత మహిళల జట్టు కూడా ఈ పోటీలలో పాల్గొన్నా.. కాంస్యపతకంతో సరిపెట్టుకుంది. ఇరాన్ జట్టును 224-217 తేడాతో ఓడించి భారత జట్టు కాంస్యపతకం సాధించింది. -
స్క్వాష్ ఫైనల్స్‌లోకి దీపిక జోడీ
ఆసియా క్రీడల్లో భారత ఖాతాలో మరో రజతం లేదా స్వర్ణం రావడం ఖాయమైపోయింది. కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రతిభతో స్వర్ణపతకం సాధించిన భారత అమ్మాయిల జోడీ దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప ఆసియా క్రీడల్లోనూ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్టును 2-0 తేడాతో ఓడించి వాళ్లీ ఘనత సాధించారు. ఇప్పుడు ఫైనల్స్‌లో మలేసియా జట్టుతో పోటీ పడబోతున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గితే ఇక స్వర్ణపతకం వచ్చేసినట్లే. ప్రపంచ నెంబర్ 21 ర్యాంకర్ అయిన జోష్న యూనక్ పార్క్‌ను కేవలం 34 నిమిషాల్లోనే 3-0 తేడాతో ఓడించింది. మరోవైపు ప్రపంచ 12వ ర్యాంకర్ అయిన దీపిక సున్మీ సాంగ్‌పై 37 నిమిషాల్లో 3-1 తేడాతో గెలిచింది. మరో సెమీ ఫైనల్లో మలేసియా జట్టు హాంగ్‌కాంగ్ జట్టును 2-0 తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది.