ఫిక్సింగ్ వల్లే బాక్సింగ్లో ఓటమి?
ఆసియా క్రీడల్లో కొత్త వివాదం మొదలైంది. ఇంచియాన్లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ సరితాదేవి సెమీ ఫైనల్స్లో అద్భుతంగా పోరాడినా.. ఆమెను ఓడిపోయినట్లు ప్రకటించారని, దీని వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఈ బౌట్లో తాను పూర్తి ఆధిపత్యం కనబర్చినా, చివరకు జడ్జిలు మాత్రం దక్షిణ కొరియాకు చెందిన జీనా పార్క్ గెలిచినట్లు ప్రకటించడంతో సరితాదేవి కూడా ఆగ్రహానికి గురైంది. ఇది చాలా అనాగరికమైన నిర్ణయమని సరిత భర్త తోయిబా సింగ్ అన్నారు.
ఇలాగే తమకు కూడా అన్యాయం జరిగిందంటూ మంగోలియా జట్టు ఫిర్యాదు చేసిన తర్వాత భారత జట్టుకూడా ఫిర్యాదుచేసింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య దక్షిణ కొరియా ఆధిపత్యంలో ఉంటుంది. అందుకే ఇలా జరిగిందని అంటున్నారు. ఇక మన బాక్సింగ్ సంఘాల విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో చివరకు కొత్తగా బాక్సింగ్ ఇండియా అనే సంస్థను అమెచ్యూర్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ ఏర్పాటుచేయించింది.
సరితాదేవి బౌట్ను సమీక్షించాలంటూ ఆమె భర్తతో పాటు టీమ్ కోచ్ సాగర్ ధైయ్యా కూడా ఫిర్యాదుచేశారు. ఇందుకోసం 500 డాలర్ల ప్రొటెస్ట్ ఫీజు కూడా కట్టారు. బాక్సింగ్లో భారత్కు తాము అనేక పతకాలు తెస్తున్నామని, అయినా జట్టు యాజమాన్యం మాత్రం నిరసన విషయంలో తమకు అండగా ఉండట్లేదని సరితాదేవి వాపోయింది. ఈశాన్య ప్రాంతాలకు చెందినవాళ్లు భారతీయులు కారా అని ఆమె నిలదీసింది. సరితకు జరిగిన అన్యాయం విషయంలో మేరీ కోమ్ కూడా నిరసన వ్యక్తం చేసింది. ప్రత్యర్థి కొరియా బాక్సర్ కావడం వల్లే సరిత ఓడిపోయినట్లు ప్రకటించారని, ఇది చాలా దారుణమని మేరీకోమ్ వ్యాఖ్యానించింది.