బాక్సర్ సరితాదేవికి హెచ్చరికతో సరి
ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని నిరాకరించి, దాన్ని రజత పతక విజేత కొరియన్ అమ్మాయి మెడలో వేసేసి వెళ్లిపోయినందుకు ఆమెను తీవ్రంగా హెచ్చరించి వదిలేశారు. తాను క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆమె క్షమాపణ చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఊరుకున్నారు. పతకాల ప్రదానోత్సవంలో సరితాదేవి ప్రవర్తన పట్ల తాము ఏమాత్రం సంతృప్తి చెందలేదని అన్నారు.
అయితే ఆమె క్షమాపణ చెప్పడం, అది కావాలని జరిగిన సంఘటన కాదని భారత బృందం కూడా తెలియజేయడంతో హెచ్చరించి వదిలేయాలని నిర్ణయించామని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా (ఓసీఏ) తెలిపింది. ఈ విషయాన్ని ఓసీఏ గౌరవ జీవితకాల ఉపాధ్యక్షుడు వీ జిఝాంగ్ తెలిపారు. భారత బృందానికి దీంతో ఏమాత్రం సంబంధం లేదని, అది కేవలం ఒక్క అథ్లెట్ చేసిన పొరపాటని తాము భావిస్తున్నామన్నారు.