ఏడుస్తూ.. పతకం తిరిగిచ్చేసిన బాక్సర్ సరిత
ఆసియా క్రీడల్లో ఎప్పుడూ లేనంత ఉద్విగ్నత బుధవారం కనిపించింది. సెమీఫైనల్స్లో వివాదాస్పద రీతిలో ఓడిపోయిన భారత బాక్సర్ సరితాదేవి అధికారులకు, ప్రేక్షకులకు కూడా షాకిచ్చింది. పోడియం మీద కన్నీరు మున్నీరుగా విలపించి.. తన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసింది. సెమీఫైనల్స్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కొరియా బాక్సర్ గెలిచినట్లు జడ్జీలు ప్రకటించడంతో సరితాదేవి, ఆమె భర్త కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సరితపై నెగ్గినట్లు ప్రకటించిన జీనా పార్క్ ఫైనల్లో ఓడిపోయి రజత పతకం సాధించింది. వాస్తవానికి సెమీస్ బౌట్లో సరితాదేవి పూర్తి ఆధిక్యం కనబర్చింది. అయినా కూడా జీనాపార్క్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పీల్ చేసినా పట్టించుకోలేదు.
దాంతో పోడియం మీదకు పిలిచినప్పటినుంచి సరితాదేవి ఏడుస్తూనే ఉంది. అసలు పతకం వేసుకోడానికి కూడా నిరాకరించి.. దాన్ని రజతపతకం సాధించిన జీనా పార్క్కే ఇచ్చేసింది. ఇంతకుముందు ఆసియా, ప్రపంచ ఛాంపియన్షిప్లు కూడా గెలిచిన సరితాదేవి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన చూసి షాకైన జీనా పార్క్.. ఏం చేయాలో తెలియక పోడియం మీదే కాంస్య పతకం వదిలేసి అక్కడినుంచి ఆమె కూడా వెళ్లిపోయింది. దాంతో నిర్వాహకులు కాంస్యపతకాన్ని తమవద్దే ఉంచుకున్నారు.
ఒకటిన్నర సంవత్సరాల బాబును కూడా తాను వదిలిపెట్టి కఠోరమైన శిక్షణ తీసుకున్నానని, చివరకు తన కొడుకు కూడా ఒకదశలో తనను గుర్తుపట్టలేదని సరితాదేవి వాపోయింది. తనకు ఆ పతకం అక్కర్లేదు కాబట్టే దాన్ని కొరియన్లకు ఇచ్చేశానని చెప్పింది. దీని తర్వాత వచ్చే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది.