ముంబై: తాత్కాలిక నిషేధం ఎదుర్కొంటున్న బాక్సర్ ఎల్.సరితా దేవికి... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతిచ్చాడు. ఈ కేసులో సరితకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాశాడు. బాక్సర్ కెరీర్ అర్ధాంతరంగా ముగియకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇంచియాన్ ఏషియాడ్‌లో పతకం తీసుకునేందుకు నిరాకరించిన సరితపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఓ క్రీడాకారుడిగా సరిత భావోద్వేగ సంఘటనను అర్థం చేసుకోగలనని చెప్పాడు. ‘జరిగిన సంఘటనలో బాక్సర్ తన ఆందోళనను అణుచుకోలేకపోయింది. దురదృష్టవశాత్తు అది బహిర్గతమైంది.
అయినప్పటికీ ఆమె వెంటనే క్షమాపణలు కూడా చెప్పింది. పశ్చాత్తాపం వ్యక్తం చేసింది కాబట్టి మరో అవకాశం ఇచ్చి చూడాలి. ఈ కేసులో దేశం మొత్తం సరితకు అండగా నిలవాలి. ఆమె అత్యున్నత స్థాయిలో రాణించేందుకు అవకాశం కల్పించాలి’ అని సచిన్ లేఖలో రాశాడు.