
హాకీ జట్టుకు ఉపరాష్ట్రపతి అభినందనలు
ఇంచియాన్లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి భారత కీర్తి పతాకాన్ని వినువీధిలో సగర్వంగా ఎగరేసిన హాకీ జట్టును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభినందించారు. ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం భారతీయులందరూ గర్వపడేలా చేసిందని, భవిష్యత్తులో కూడా హాకీని జాతీయ క్రీడగా గుర్తించేందుకు తగిన వనరులు, మంచి ప్రయత్నాలు జరిగేందుకు దోహదపడుతోందని ఆయన అన్నారు.
విజయం సాధించిన హాకీ జట్టు సభ్యులకు అన్సారీ అభినందనల సందేశాన్ని పంపారు. విజయదశమి ఉత్సవాలకు తోడు హాకీ సంబరాలు కూడా భారతదేశంలో జరుగుతున్నాయని, ఈ విజయంలో మీ మీ కుటుంబ సభ్యులతో పాటు యావద్దేశం చేతులు కలుపుతుందని ఆయన అన్నారు.