భారత టీటీ జట్టులో స్నేహిత్, శ్రీజ | snehit,srija selected Table tennis tournment | Sakshi
Sakshi News home page

భారత టీటీ జట్టులో స్నేహిత్, శ్రీజ

Published Fri, Feb 21 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

snehit,srija selected Table tennis tournment

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: టేబుల్ టెన్నిస్‌లో విశేషంగా రాణిస్తున్న హైదరాబాదీలు స్నేహిత్, ఆకుల శ్రీజ, నైనా జైస్వాల్, హరికృష్ణలు భారత జట్టుకు ఎంపికయ్యారు. ఐటీటీఎఫ్ గ్లోబల్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత క్యాడెట్, జూనియర్ జట్లకు ఎంపికయ్యారు. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి డి.ఆర్.చౌదరి ఈ మేరకు వెల్లడించారు.
 
 భారత బాలుర జట్టులో చాన్నాళ్ల తర్వాత ఇద్దరు క్రీడాకారులు చోటు దక్కించుకోవడం పట్ల రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుల్తానా హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు త్వరలో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తారని చెప్పారు. క్యాడెట్ అండర్-15 బాలుర విభాగంలో ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్, వి.ఎస్.హరికృష్ణలకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది.
 
 అలాగే భారత జూనియర్ జట్టుకు ఆకుల శ్రీజా, నైనాలు ఎంపికయ్యారు. ఈ పోటీలు మార్చి 25 నుంచి 28 వరకు గోవాలో జరుగుతాయి. రాష్ట్ర సబ్ జూనియర్ చాంపియన్ అయిన స్నేహిత్... జూనియర్ , యూత్ విభాగం రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. జాతీయ సబ్ జూనియర్ విభాగంలో అతను మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. స్నేహిత్, శ్రీజాలు గ్లోబల్ టీటీ అకాడమీలో శిక్షణ పొందారు.
 
 
  హరికృష్ణ సెయింట్ పాల్స్ టీటీ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. హరికృష్ణ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ టీటీ అకాడమీలో తోటి క్రీడాకారులు, కోచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు. కోచ్‌లు ఇబ్రహీమ్ ఖాన్, నాగేందర్‌రెడ్డిలు ఈ సందర్భంగా మాట్లాడుతూ హరికృష్ణకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. అంకితభావం గల హరికి కష్ణపడేతత్వం ఉందని వారు పేర్కొన్నారు. ఎల్బీస్టేడియంలో శిక్షణ పొందిన నైనా ఇప్పటికే పలు అంతర్జాతీయ టీటీ టోర్నీల్లో సత్తాచాటిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement