Best Rank
-
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో యూకీ బాంబ్రీ
అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 32 ఏళ్ల యూకీ ఐదు స్థానాలు ఎగబాకి 43వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫ్రాన్స్‌కు చెందిన డబుల్స్ భాగస్వామి అల్బానో ఒలివెట్టితో కలిసి యూకీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో యూకీ ర్యాంక్ మెరుగైంది. భారత స్టార్ రోహన్ బోపన్న రెండు స్థానాలు పడిపోయి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంకులో దివ్య దేశ్‌ముఖ్ (ఫోటోలు)
-
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో శ్రీజ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 25 ఏళ్ల శ్రీజ ఏడు స్థానాలు ఎగబాకి 40వ ర్యాంక్‌కు చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీజ గత వారం లెబనాన్‌లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) రెండు టోర్నీల్లో రాణించింది. తొలి టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన ఆమె రెండో టోర్నీలో విజేతగా నిలిచింది. మనిక బత్రా 38వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. మే 16వ తేదీ వరకు భారత టాప్–2 ర్యాంకర్లకు పారిస్ ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో పోటీపడే అవకాశం లభిస్తుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఆచంట శరత్ కమల్ 35వ ర్యాంక్‌లో ఉండగా... సత్యన్ జ్ఞానశేఖరన్ 43 స్థానాలు ఎగబాకి 60వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. తెలంగాణ ప్లేయర్ స్నేహిత్ 22 స్థానాలు పురోగతి సాధించి 144వ ర్యాంక్‌లో నిలిచాడు. -
టాప్–100లోకి అనిరుధ్
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో అనిరుధ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి సరిగ్గా 100వ ర్యాంక్‌లో నిలిచాడు. గతవారం అమెరికాలో జరిగిన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)తో కలిసి ఆడిన అనిరుధ్ డబుల్స్‌లో సెమీఫైనల్ చేరుకోవడంతో అతని ర్యాంక్ మెరుగైంది. వెటరన్ రోహన్ బోపన్న ఒక స్థానం పడిపోయి ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా... యూకీ బాంబ్రీ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 60వ ర్యాంక్‌లో, సాకేత్ మైనేని నాలుగు స్థానాలు పురోగతి సాధించి 77వ ర్యాంక్‌లో నిలిచారు. జీవన్ నెడుంజెళియన్ 91వ ర్యాంక్‌లో, శ్రీరామ్ బాలాజీ 94వ ర్యాంక్‌లో ఉన్నారు. మరోవైపు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సుమిత్ నగాల్ ఏకంగా 53 స్థానాలు ఎగబాకి 178వ ర్యాంక్‌లో నిలిచాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు ఆర్చర్ సురేఖ...
ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన కెరీర్లోనే ఉత్తమ ర్యాంక్‌ను అందుకుంది. ప్రపంచ ఆర్చరీ తాజా ర్యాంకింగ్స్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సురేఖ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. తద్వారా కాంపౌండ్ విభాగంలో అత్యుత్తమ ర్యాంక్ అందుకున్న భారతీయ ఆర్చర్‌గా ఆమె గుర్తింపు పొందింది. విజయవాడకు చెందిన 25 ఏళ్ల సురేఖ ఇటీవల ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్)–చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జంట తమ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో.... గతవారం చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సెమీస్ చేరిన సాత్విక్–చిరాగ్ ద్వయం రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిది నుంచి ఏడో ర్యాంక్‌కు చేరుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ షట్లర్‌గా హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ అవతరించాడు. సాయిప్రణీత్ ఒక స్థానం పురోగతి సాధించి పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. సాయిప్రణీత్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇప్పటిదాకా పదో ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్ ర్యాంకర్‌గా ఉన్న కిడాంబి శ్రీకాంత్ మూడు స్థానాలు పడిపోయి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. పురుషుల సింగిల్స్‌లో టాప్–50లో ఎనిమిది మంది భారత ఆటగాళ్లు ఉండటం విశేషం. సమీర్ వర్మ (16వ స్థానం), కశ్యప్ (25వ), ప్రణయ్ (28వ), సౌరభ్ వర్మ (38వ), లక్ష్య సేన్ (42వ), శుభాంకర్ డే (44వ స్థానం) టాప్–50లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఆరో ర్యాంక్‌లో, సైనా తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. -
కెరీర్ బెస్ట్ 17వ ర్యాంకులో రోహిత్
దుబాయ్: భారత ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ టెస్టుల్లో కెరీర్ బెస్ట్ 17వ ర్యాంక్‌కు ఎగబాకాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అతను 36 స్థానాల్ని మెరుగుపర్చుకొని 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. వైజాగ్ టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇతనికి జోడీగా ఆడిన మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ర్యాంకూ మెరుగైంది. అతను 38 స్థానాల్ని మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 25వ ర్యాంకులో నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ 900 రేటింగ్ పాయింట్ల దిగువన పడిపోయాడు. గతేడాది జనవరి నుంచి 900 పైబడిన రేటింగ్ పాయింట్లతో ఉన్న కోహ్లి ఖాతాలో ఇప్పుడు 899 పాయింట్లున్నాయి. టాప్ ర్యాంకులో ఉన్న స్టీవ్ స్మిత్ (937, ఆస్ట్రేలియా) కంటే 38 పాయింట్లు తక్కువ ఉన్నాయి. టెస్టు బౌలర్ల జాబితాలో మళ్లీ భారత స్పిన్నర్ అశ్విన్ టాప్–10లోకి చేరాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీయడం ద్వారా 4 స్థానాల్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఐసీసీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ సిరీస్‌లో భారత్ తొలి టెస్టు విజయంతో 40 పాయింట్లను ఖాతాలో వేసుకొని మొత్తం 160 పాయింట్లతో ఉంది. విండీస్‌పై 2–0తో గెలవడం ద్వారా 120 పాయింట్లను పొందింది. అమ్మాయిల జట్టు పటిష్టంగా... ఐసీసీ మహిళల జట్ల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నిలకడగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ... పాయింట్ల పరంగా పటిష్టమైంది. 122 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉండగా... 125 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆసీస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టి20ల్లో కూడా కంగారూ జట్టుదే టాప్ ర్యాంకు కాగా... భారత్ ఐదో స్థానంలో ఉంది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో బుమ్రా
దుబాయ్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అత్యద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా తొమ్మిది స్థానాలు పురోగతి సాధించి తొలిసారి టాప్–10లోకి దూసుకొచ్చాడు. 774 రేటింగ్ పాయింట్లతో బుమ్రా ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. ఇప్పటివరకు బుమ్రా అత్యుత్తమ ర్యాంక్ 15గా ఉండేది. 908 రేటింగ్ పాయింట్లతో కమిన్స్ (ఆస్ట్రేలియా), రబడ (దక్షిణాఫ్రికా–851 పాయింట్లు), అండర్సన్ (ఇంగ్లండ్–814 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్‌కే చెందిన రవీంద్ర జడేజా పదో స్థానంలో నిలిచాడు. కోహ్లి ‘టాప్’లోనే... టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 910 ర్యాంకింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్టుకు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 904 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) మూడో ర్యాంక్‌లో, చతేశ్వర్ పుజారా (భారత్) నాలుగో ర్యాంక్‌లో ఉన్నారు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన అజింక్య రహానే 10 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరాడు. అజేయ సెంచరీతో యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను గెలిపించిన బెన్ స్టోక్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను అందుకున్నాడు. -
టాప్–10లోకి సౌరవ్ ఘోషల్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ప్రపంచ ర్యాంకింగ్స్ పురుషుల విభాగంలో టాప్–10లోకి అడుగు పెట్టిన తొలి భారత క్రీడాకారుడిగా సౌరవ్ ఘోషల్ రికార్డు సృష్టించాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఘోషల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 10వ స్థానంలో నిలిచాడు. 2018–19 సీజన్లో పీఎస్ఏ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో, ప్రతిష్టాత్మక గ్రాస్‌హాపర్ కప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన సౌరవ్ ఇటీవల ప్రదర్శన అతనికి అత్యుత్తమ ర్యాంక్‌ను అందించింది. గతంలో మహిళల విభాగంలో భారత క్రీడాకారిణులు జోష్న చిన్నప్ప, దీపిక పల్లికల్ టాప్–10లో ఉన్నారు. -
ప్రజ్నేశ్ సంచలనం
కాలిఫోర్నియా: కెరీర్లో తొలిసారి మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్ ఆడుతోన్న భారత టెన్నిస్ నంబర్‌వన్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ సంచలనంతో శుభారంభం చేశాడు. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ఈ చెన్నై క్రీడాకారుడు రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రజ్నేశ్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 7–6 (7/5), 6–4తో ప్రపంచ 69వ ర్యాంకర్ బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. 89 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 97వ ర్యాంకర్ ప్రజ్నేశ్ కీలకదశలో పాయింట్లు సాధించి ఫలితాన్ని శాసించాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన ప్రజ్నేశ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మూడేళ్ల క్రితం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 18వ ర్యాంక్‌లో నిలిచిన బెనోయిట్ పెయిర్... 2017 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో, 2015 యూఎస్ ఓపెన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. తాజా ప్రదర్శనతో ప్రజ్నేశ్ 80వ ర్యాంక్‌కు చేరుకునే అవకాశముంది. ‘నా కెరీర్‌లోమరో గొప్ప విజయమిది. కీలక సమయంలో ఈ గెలుపు లభించింది. వింబుల్డన్ టోర్నీలో నేరుగా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించేందుకు చేరువయ్యాను. మేటి ఆటగాళ్లపై విజయాలు సాధిస్తే నాలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది’ అని ప్రజ్నేశ్ అన్నాడు. రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ నికోలజ్ బాసిలాష్విలి (జార్జియా)తోప్రజ్నేశ్ ఆడతాడు. -
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పులివెందులకు ఉత్తమ ర్యాంకు
సాక్షి,పులివెందుల : దేశవ్యాప్తంగా ఈఏడాది నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో పులివెందుల మున్సిపాలిటీకి అత్యుత్తమ ర్యాంకు అందుకుంది. వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు చూపించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సూచికల పట్టికలో జిల్లాలో ప్రథమంగా నిలవడం హర్షణీయం. 2007 సంవత్సరంలో పులివెందుల మున్సిపాలిటీకి డస్ట్‌బిన్ ఫ్రీ అవార్డు కూడా అందుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా మున్సిపాలిటీల ర్యాంకులను ప్రకటించింది. దేశంలో 4జోన్లుగా విభజించారు. ఇందులో దక్షిణ భారత దేశంలో పులివెందుల మున్సిపాలిటీకి 12వస్థానం కైవసం చేసుకుంది. రాష్ట్రంలోనే 4వ స్థానం కైవసం చేసుకోగా వైఎస్సార్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులివెందుల మున్సిపాలిటీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉత్తమ మున్సిపాలిటీగా పేరొందుతుంది. పులివెందుల మున్సిపాలిటీలో డస్ట్బిన్లు లేకుండా డస్ట్‌బిన్ ఫ్రీ అవార్డు అందుకోవడమే కాకుండా మున్సిపాలిటీలో ఎక్కడ చెత్తచెదారం..కాలువలు లేకుండా యూజీడీ ఏర్పాటు, వీధివీధికి, ప్రతి ప్రాంతంలోను సీసీరోడ్లు ఏర్పాటు చేయడంతో పులివెందులకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకులు సాధించింది. ఇందు కోసం పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు, అధికారులకు మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్సార్ సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ మనోహర్‌రెడ్డి కృషితో.. వైఎస్సార్ సీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి కృషి ఎంతగానో దోహదపడింది. పులివెందుల మున్సిపాలిటీకి శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోయిన తానే శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ప్రతి రోజు ఉదయం ప్రతి వార్డులు తిరుగుతూ ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషిచేశారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆయన మాటకు విలువిచ్చి చెప్పిన పనిని శ్రద్ధగా చేయడంతోనే ఆదర్శ మున్సిపాలిటీగా పేరుతెచ్చుకుంది. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి చొరవచూపుతూ రావడంవల్లే జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రజలు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడిన మొదటి నుండే పులివెందుల మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు నిరంతరం పడ్డ శ్రమకు గుర్తింపు లభించింది. దీంతో పురప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
స్నేహిత్ @ 24
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) అండర్–18 బాలుర సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ యువ సంచలనం సూరావజ్జుల స్నేహిత్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవలే ఇటలీలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన స్నేహిత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్‌లో అతను ఏకంగా 40 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌ను అందుకున్నాడు. సింగిల్స్‌లో భారత్ నుంచి రెండో అత్యుత్తమ ర్యాంకర్ స్నేహిత్ కావడం విశేషం. గుజరాత్ ప్లేయర్ మానవ్ ఠక్కర్ రెండో ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌గా ఉన్నాడు. గత ఆరు నెలలుగా అంతర్జాతీయస్థాయిలో స్నేహిత్ జోరు కొనసాగిస్తున్నాడు. గతేడాది జోర్డాన్ ఓపెన్‌లో స్వర్ణం, రజతం నెగ్గిన 17 ఏళ్ల స్నేహిత్... స్లొవేనియా, ఇండియా ఓపెన్ టోర్నీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు. -
హరికృష్ణకు కెరీర్ బెస్ట్ ర్యాంక్
టాప్-10లో తొలిసారి ప్రవేశం చెన్నై: ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తన కెరీర్లో ఉత్తమ ర్యాంక్‌ను సాధించాడు. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌సలో 30 ఏళ్ల హరికృష్ణ రెండు స్థానాలు పురోగతి సాధించి పదో ర్యాంక్‌కు ఎగబాకాడు. హరికృష్ణ ఖాతాలో 2768 రేటింగ్ పారుుంట్లు ఉన్నారుు. గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ 2001లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందాడు. ఇప్పటివరకు కెరీర్లో హరికృష్ణ 364 గేముల్లో గెలిచి, 446 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, 135 గేముల్లో ఓడిపోయాడు. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్ 2779 పారుుంట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా టాప్-100లో భారత్ నుంచి ఏడుగురు ఆటగాళ్లు చోటు సంపాదించారు. భారత్‌కే చెందిన విదిత్ సంతోష్ గుజరాతి 53వ, పరిమార్జన్ నేగి 76వ, అధిబన్ 82వ, సూర్యశేఖర గంగూలీ 86వ, కృష్ణన్ శశికిరణ్ 100వ ర్యాంక్‌లో ఉన్నారు. -
ఏడేళ్ల తరువాత మళ్లీ 'బెస్ట్' అయ్యాడు!
దుబాయ్:వయసు పెరుగుతున్నా ఆటలో వన్నె తగ్గని పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ తన టెస్టు కెరీర్ లో మరోసారి రెండో ర్యాంకు సాధించాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగ్స్‌లో యూనిస్ ఖాన్ టాప్-2లో నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో శతకం సాధించిన యూనిస్ ఖాన్.. నంబర్ టూ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. దాదాపు ఏడేళ్ల తరువాత యూనిస్ ఖాన్ తన టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్-2లో నిలవడం ఇదే తొలిసారి. 2009లో మార్చి నెలలో అగ్రస్థానం దక్కించుకున్న యూనిస్.. అదే ఏడాది జూలైలో రెండో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం 860 రేటింగ్ పాయింట్లతో యూనిస్ రెండో్ స్థానానికి ఎగబాకాడు. ఈ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 906 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ 852 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో పాక్ స్పిన్నర్ యాసిర్ షా మరోసారి టాప్-5లో నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నాడు. -
అవినీతిలో ఫస్ట్ అభివృద్ధిలో వరస్ట్
ఉత్తమ ర్యాంకింగుల్లో దక్కని స్థానం పాలనపై పట్టుకోల్పోయిన కమిషనర్ అధికారపక్షంలో మామూళ్ల కీచులాటలు అవినీతిలో ఫస్ట్.. అభివృద్ధిలో వరస్ట్ చందంగా నగరపాలక సంస్థ పనితీరు తయా రైంది. ఆన్లైన్, యాప్ వంటి సౌకర్యాల కల్పనలో ముందంజలో ఉన్నామని బడాయిలు చెప్పుకొంటున్న అధికారులు, పాలకులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టాప్‌టెన్ జాబితాలో బెజవాడను నిలబెట్టలేకపోయారు. ఒకప్పుడు ఉత్తమ కార్పొరేషన్‌గా అవార్డులు అందుకున్న నగరం ఇప్పుడు అధ్వాన స్థితికి రావడానికి అనేక కారణాలున్నాయి. సమగ్ర ప్రణాళికలు లేకపోవడం, సమన్వయ లోపం, హద్దుల్లేని అవినీతి వెరసి నగరపాలక సంస్థ అభివృద్ధిని మింగేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ : ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉత్తమ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జాబితాలో గ్రేటర్ విశాఖ మొదటి స్థానంలో నిలవగా, గుంటూరు కార్పొరేషన్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం విదితమే. గ్రేటర్ విశాఖ, విజయవాడ కార్పొరేషన్ 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు కోసం పోరాటం చేస్తున్నాయి. ఆర్థిక వనరులు దండిగా ఉండటంతో గ్రేటర్ విశాఖలో ప్రతినెలా ఒకటో తేదీ ఠంఛన్‌గా జీతాలు చెల్లిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నం. జీతాల కోసం ఉద్యోగులు లాటరీ కొట్టాల్సిందే. వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అధికారుల అవినీతి అందుకు అడ్డుపడుతోంది. జంతర్ మంతర్ ఆస్తిపన్నుల వసూలులో జంతర్‌మంతర్ నడుస్తోంది. నగరపాలక సంస్థ రికార్డు ప్రకారం 1,79,245 అసెస్మెంట్ల నుంచి రూ.80 కోట్ల 65 వేల పన్నులు వసూలు కావాల్సి ఉంది. గడిచిన రెండేళ్లుగా నూరు శాతం పన్ను వసూళ్లతో కార్పొరేషన్ ముందంజలో ఉంది. మరి ఇంకేంటి తేడా అనుకుంటున్నారా? టౌన్‌ప్లానింగ్ విభాగం నెలకు 250 ప్లాన్లను మంజూరు చేస్తోంది. అంటే ఏడాదికి మూడువేలు చొప్పున కొత్తగా నిర్మాణం అయ్యే ఇళ్లకు పన్నులు విధించాల్సి ఉంటుంది. గడిచిన రెండేళ్లుగా రెవెన్యూ విభాగం అధికారులు ఇదే డిమాండ్‌ను చూపుతున్నారు. 14 వేల ఖాళీ స్థలాల నుంచి రూ.57 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా రూ.7 కోట్లు మాత్రమే వసూలు చేశారు. అత్యధిక శాతం అపార్ట్మెంట్ల నుంచి యూజీడీ, కుళాయి పన్ను వసూలు చేయడం లేదని సమాచారం. ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. సర్వేలతో సరి సమగ్ర సర్వే ద్వారా నగరంలో రూ.650 కోట్ల మేర పన్నులు వసూలవుతాయని కలెక్టర్ బాబు.ఎ, కమిషనర్ జి.వీరపాండియన్ ఏడాది క్రితం ప్రకటించారు. సర్వే పేరుతో ఉద్యోగుల్ని కొండలు, గుట్టలు ఎక్కించి మరీ తిప్పారు. ఇంత చేసినా కనీసం రూ.10 కోట్ల మేర కూడా పన్నులు పెరగలేదు. పెలైట్ ప్రాజెక్ట్ కింద డ్రోన్ సర్వేను నాలుగు డివిజన్లలో చేపట్టారు. సర్వేల పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నారే తప్ప ఆ మేర ఆదాయాన్ని రాబట్టలేకపోతున్నారు. అవినీతి కట్టడిలో విఫలం టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ, ప్రజారోగ్య శాఖ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) విభాగాల్లో అవినీతి పేట్రేగుతోంది. దీనిని కట్టడి చేయడంలో కమిషనర్ విఫలమయ్యారనే వాదనలు ఉన్నాయి. కోటరీ చెప్పుచేతల్లోనే వీరపాండియన్ పాలన సాగిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. కమిషనర్ పనితీరు ఏమాత్రం బాగోలేదంటూ మేయర్ కోనేరు శ్రీధర్ మున్సిపల్ మంత్రి పి.నారాయణ, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.వలవెన్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. కమిషనర్ కలెక్టర్ వెంట తిరగడం వల్ల నగరాభివృద్ధి కుంటుపడుతోందనేది మేయర్ అభియోగం. 103 ఫిర్యాదుల నుంచి అన్ని సెక్షన్లకు సంబంధించి ఫైళ్లు గుట్టలుగా పెండింగ్ ఉన్నాయని సమాచారం. ఏలూరు, బందరు రోడ్లను లిట్టర్ ఫ్రీ జోన్లుగా ప్రకటించి హడావుడి చేస్తున్న అధికారులు నగరంలో పేరుకుపోతున్న చెత్త కుప్పల గురించి పట్టించుకోవడం లేదు. కీచులాటల్లో అధికారపక్షం నగరాభివృద్ధిపై దృష్టిసారించాల్సిన అధికారపక్షం మామూళ్ల కీచులాటల్లో తలమునకలైంది. మేయర్, అసమ్మతి గ్రూపుల మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ కారణంగా అధికారులు మేయర్‌ను లెక్కచేయని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తుండటంతో అభివృద్ధి అటకెక్కింది. జీతాల చెల్లింపు, ఇంటింటి చెత్త సేకరణ, ఫిర్యాదుల పరిష్కారం, మెరుగైన సేవల్ని అమలు చేయడంలో వెనకబడటం వల్లే స్మార్ట్ సిటీలో స్థానం చేజారింది. తాజాగా ఉత్తమ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ర్యాంకింగుల్లోనూ చోటు దక్కించుకోలేకపోయింది. ప్చ్...! -
రోహిత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్
దుబాయ్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించిన భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదివారం విడుదల చేసిన తాజా జాబితాలో అతను ఎనిమిది స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతుండగా, కెప్టెన్ ధోని... ఏడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌కు పడిపోయాడు. అజింక్య రహానే 25వ ర్యాంక్‌లో ఉన్నాడు. సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో గెలిచిన టీమిండియా... తమ రెండో ర్యాంక్‌ను పదిలం చేసుకుంది. మరోవైపు ఆసీస్ ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్, స్మిత్, వార్నర్, మిచెల్ మార్ష్‌లు వరుసగా 8, 15, 18, 43వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ రెండు స్థానాలు దిగజారి 11వ ర్యాంక్‌లో; భువనేశ్వర్ ఏడు స్థానాలు పడిపోయి 20వ ర్యాంక్‌లో ఉన్నాడు. జడేజా 22వ; అక్షర్ పటేల్ 33వ; ఉమేశ్ యాదవ్ 41వ; ఇషాంత్ శర్మ 71వ ర్యాంక్‌లను దక్కించుకున్నారు.