పులివెందుల మున్సిపల్ కార్యాలయం
సాక్షి,పులివెందుల : దేశవ్యాప్తంగా ఈఏడాది నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో పులివెందుల మున్సిపాలిటీకి అత్యుత్తమ ర్యాంకు అందుకుంది. వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు చూపించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సూచికల పట్టికలో జిల్లాలో ప్రథమంగా నిలవడం హర్షణీయం. 2007 సంవత్సరంలో పులివెందుల మున్సిపాలిటీకి డస్ట్‌బిన్ ఫ్రీ అవార్డు కూడా అందుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా మున్సిపాలిటీల ర్యాంకులను ప్రకటించింది. దేశంలో 4జోన్‌లుగా విభజించారు. ఇందులో దక్షిణ భారత దేశంలో పులివెందుల మున్సిపాలిటీకి 12వస్థానం కైవసం చేసుకుంది. రాష్ట్రంలోనే 4వ స్థానం కైవసం చేసుకోగా వైఎస్సార్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులివెందుల మున్సిపాలిటీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉత్తమ మున్సిపాలిటీగా పేరొందుతుంది. పులివెందుల మున్సిపాలిటీలో డస్ట్‌బిన్‌లు లేకుండా డస్ట్‌బిన్ ఫ్రీ అవార్డు అందుకోవడమే కాకుండా మున్సిపాలిటీలో ఎక్కడ చెత్తచెదారం..కాలువలు లేకుండా యూజీడీ ఏర్పాటు, వీధివీధికి, ప్రతి ప్రాంతంలోను సీసీరోడ్లు ఏర్పాటు చేయడంతో పులివెందులకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకులు సాధించింది. ఇందు కోసం పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు, అధికారులకు మున్సిపల్ చైర్‌పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్సార్ సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్ మనోహర్‌రెడ్డి కృషితో..
వైఎస్సార్ సీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి కృషి ఎంతగానో దోహదపడింది. పులివెందుల మున్సిపాలిటీకి శానిటరీ ఇన్‌స్పెక్టర్ లేకపోయిన తానే శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ప్రతి రోజు ఉదయం ప్రతి వార్డులు తిరుగుతూ ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషిచేశారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆయన మాటకు విలువిచ్చి చెప్పిన పనిని శ్రద్ధగా చేయడంతోనే ఆదర్శ మున్సిపాలిటీగా పేరుతెచ్చుకుంది.
ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి చొరవచూపుతూ రావడంవల్లే జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రజలు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడిన మొదటి నుండే పులివెందుల మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు నిరంతరం పడ్డ శ్రమకు గుర్తింపు లభించింది. దీంతో పురప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment