ఉత్తమ ర్యాంకింగుల్లో దక్కని స్థానం
పాలనపై పట్టుకోల్పోయిన కమిషనర్
అధికారపక్షంలో మామూళ్ల కీచులాటలు
అవినీతిలో ఫస్ట్.. అభివృద్ధిలో వరస్ట్ చందంగా నగరపాలక సంస్థ పనితీరు తయా రైంది. ఆన్‌లైన్, యాప్ వంటి సౌకర్యాల కల్పనలో ముందంజలో ఉన్నామని బడాయిలు చెప్పుకొంటున్న అధికారులు, పాలకులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టాప్‌టెన్ జాబితాలో బెజవాడను నిలబెట్టలేకపోయారు. ఒకప్పుడు ఉత్తమ కార్పొరేషన్‌గా అవార్డులు అందుకున్న నగరం ఇప్పుడు అధ్వాన స్థితికి రావడానికి అనేక కారణాలున్నాయి. సమగ్ర ప్రణాళికలు లేకపోవడం, సమన్వయ లోపం, హద్దుల్లేని అవినీతి వెరసి నగరపాలక సంస్థ అభివృద్ధిని మింగేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
విజయవాడ సెంట్రల్ : ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉత్తమ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల జాబితాలో గ్రేటర్ విశాఖ మొదటి స్థానంలో నిలవగా, గుంటూరు కార్పొరేషన్ నాలుగో స్థానంలో నిలిచిన విషయం విదితమే. గ్రేటర్ విశాఖ, విజయవాడ కార్పొరేషన్ 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు కోసం పోరాటం చేస్తున్నాయి. ఆర్థిక వనరులు దండిగా ఉండటంతో గ్రేటర్ విశాఖలో ప్రతినెలా ఒకటో తేదీ ఠంఛన్‌గా జీతాలు చెల్లిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నం. జీతాల కోసం ఉద్యోగులు లాటరీ కొట్టాల్సిందే. వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అధికారుల అవినీతి అందుకు అడ్డుపడుతోంది.
జంతర్ మంతర్
ఆస్తిపన్నుల వసూలులో జంతర్‌మంతర్ నడుస్తోంది. నగరపాలక సంస్థ రికార్డు ప్రకారం 1,79,245 అసెస్‌మెంట్ల నుంచి రూ.80 కోట్ల 65 వేల పన్నులు వసూలు కావాల్సి ఉంది. గడిచిన రెండేళ్లుగా నూరు శాతం పన్ను వసూళ్లతో కార్పొరేషన్ ముందంజలో ఉంది. మరి ఇంకేంటి తేడా అనుకుంటున్నారా? టౌన్‌ప్లానింగ్ విభాగం నెలకు 250 ప్లాన్లను మంజూరు చేస్తోంది. అంటే ఏడాదికి మూడువేలు చొప్పున కొత్తగా నిర్మాణం అయ్యే ఇళ్లకు పన్నులు విధించాల్సి ఉంటుంది. గడిచిన రెండేళ్లుగా రెవెన్యూ విభాగం అధికారులు ఇదే డిమాండ్‌ను చూపుతున్నారు. 14 వేల ఖాళీ స్థలాల నుంచి రూ.57 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా రూ.7 కోట్లు మాత్రమే వసూలు చేశారు. అత్యధిక శాతం అపార్ట్‌మెంట్ల నుంచి యూజీడీ, కుళాయి పన్ను వసూలు చేయడం లేదని సమాచారం. ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.
సర్వేలతో సరి
సమగ్ర సర్వే ద్వారా నగరంలో రూ.650 కోట్ల మేర పన్నులు వసూలవుతాయని కలెక్టర్ బాబు.ఎ, కమిషనర్ జి.వీరపాండియన్ ఏడాది క్రితం ప్రకటించారు. సర్వే పేరుతో ఉద్యోగుల్ని కొండలు, గుట్టలు ఎక్కించి మరీ తిప్పారు. ఇంత చేసినా కనీసం రూ.10 కోట్ల మేర కూడా పన్నులు పెరగలేదు. పెలైట్ ప్రాజెక్ట్ కింద డ్రోన్ సర్వేను నాలుగు డివిజన్లలో చేపట్టారు. సర్వేల పేరుతో లక్షలు ఖర్చు చేస్తున్నారే తప్ప ఆ మేర ఆదాయాన్ని రాబట్టలేకపోతున్నారు.
అవినీతి కట్టడిలో విఫలం
టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ, ప్రజారోగ్య శాఖ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (యూసీడీ) విభాగాల్లో అవినీతి పేట్రేగుతోంది. దీనిని కట్టడి చేయడంలో కమిషనర్ విఫలమయ్యారనే వాదనలు ఉన్నాయి. కోటరీ చెప్పుచేతల్లోనే వీరపాండియన్ పాలన సాగిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. కమిషనర్ పనితీరు ఏమాత్రం బాగోలేదంటూ మేయర్ కోనేరు శ్రీధర్ మున్సిపల్ మంత్రి పి.నారాయణ, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.వలవెన్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. కమిషనర్ కలెక్టర్ వెంట తిరగడం వల్ల నగరాభివృద్ధి కుంటుపడుతోందనేది మేయర్ అభియోగం. 103 ఫిర్యాదుల నుంచి అన్ని సెక్షన్లకు సంబంధించి ఫైళ్లు గుట్టలుగా పెండింగ్ ఉన్నాయని సమాచారం. ఏలూరు, బందరు రోడ్లను లిట్టర్ ఫ్రీ జోన్లుగా ప్రకటించి హడావుడి చేస్తున్న అధికారులు నగరంలో పేరుకుపోతున్న చెత్త కుప్పల గురించి పట్టించుకోవడం లేదు.
కీచులాటల్లో అధికారపక్షం
నగరాభివృద్ధిపై దృష్టిసారించాల్సిన అధికారపక్షం మామూళ్ల కీచులాటల్లో తలమునకలైంది. మేయర్, అసమ్మతి గ్రూపుల మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ కారణంగా అధికారులు మేయర్‌ను లెక్కచేయని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తుండటంతో అభివృద్ధి అటకెక్కింది. జీతాల చెల్లింపు, ఇంటింటి చెత్త సేకరణ, ఫిర్యాదుల పరిష్కారం, మెరుగైన సేవల్ని అమలు చేయడంలో వెనకబడటం వల్లే స్మార్ట్ సిటీలో స్థానం చేజారింది. తాజాగా ఉత్తమ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ర్యాంకింగుల్లోనూ చోటు దక్కించుకోలేకపోయింది. ప్చ్...!