
సాక్షి, కాచిగూడ (హైదరాబాద్) : జాతీయస్థాయిలో టేబుల్ టెన్నిస్ క్రీడలో రాణిస్తూనే పిన్న వయసులోనే పెద్ద చదువులు చదువుతూ రికార్డు సృష్టిస్తున్నాడు కాచిగూడకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆగస్త్య జైస్వాల్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యాడు. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీ కాలేజీలో బీఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదివాడు. 9 ఏళ్ల వయసులోనే 10వ తరగతి, 11 ఏళ్లలో ఇంటర్ పూర్తి చేశాడు.
తెలంగాణ రాష్ట్రంలోనే 14 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన బాలుడిగా ఆగస్త్య జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఆగస్త్య జైస్వాల్ సోదరి నైనా జైస్వాల్ టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ 13 ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా మంగళవారం కాచిగూడలో తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, అశ్విన్‌కుమార్‌లతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అగస్త్య జైస్వాల్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆగస్త్య జైస్వాల్ మాట్లాడుతూ చిన్న వయసులోనే విభిన్న రంగాల్లో రాణించడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నాడు. స్కూల్‌కు వెళ్లకుండా తల్లిదండ్రులనే తన గురువులుగా చేసుకుని క్రీడా, విద్యా రంగాల్లో రాణిస్తున్నట్లు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment