
న్యూఢిల్లీ: నాలుగు పదుల వయసున్నా... ఏళ్ల తరబడి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నా... తనలో వన్నె తగ్గలేదని మాటల్లో కాదు... చేతల్లో నిరూపించాడు వెటరన్ స్టార్ శరత్ కమల్. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించాడు. అయితే తన కెరీర్‌లో 2006 నుంచి ఎన్నో కామన్వెల్త్ పతకాలున్నప్పటికీ ఒలింపిక్స్ పతకం మాత్రం లోటుగా ఉందని, అదే తన లక్ష్యమని శరత్ తెలిపాడు.
20 ఏళ్లుగా ఆడుతున్నప్పటికీ రిటైర్మెంట్ ఆలోచనే రావడం లేదని, ఆటపై తన ఉత్సాహాన్ని వెలిబుచ్చాడు. ‘ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ‘మూడు’గా ఉన్న అత్యధిక పతకాల సంఖ్య తాజా ఈవెంట్‌లో ‘నాలుగు’కు చేరింది. పూర్తి ఫిట్‌నెస్ ఉండటంతో ఇకమీదట ఆడాలనే తపనే నన్ను నడిపిస్తోంది. నేనెప్పుడు శారీరకంగానే కాదు మానసికంగాను దృఢంగా ఉండేందుకే ప్రయత్నిస్తా.
కుర్రాళ్లతో సహ పోటీపడాలంటే వాళ్లంత చురుగ్గా ఉండాలి కదా! ఓవరాల్‌గా ఇన్నేళ్లలో కామన్వెల్త్ గేమ్స్‌లో 13 సాధించిన నా విజయవంతమైన కెరీర్‌లో ఒలింపిక్స్ పతకమే బాకీ ఉంది. దాని కోసం మరింత మెరుగయ్యేందుకు శ్రమిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు. పారిస్ ఒలింపిక్స్‌కు రెండేళ్ల సమయం వుండటంతో ముందుగా టీమ్ ఈవెంట్‌లో అర్హత సాధించడంపై దృష్టి సారిస్తాననని చెప్పాడు.
తన తొలి కామన్వెల్త్ (2006)లో సాధించిన స్వర్ణంతో బర్మింగ్‌హామ్ స్వర్ణాన్ని పోల్చకూడదని అన్నాడు. యువ రక్తంతో ఉన్న తనపై అప్పుడు ఎలాంటి అంచనాల్లేవని, కానీ ఇప్పుడు సీనియర్‌గా తనపై గురుతర బాధ్యత ఉండిందని శరత్ వివరించాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిందని, పోటీతత్వం అంతకంతకు పెరిగిందని అవన్నీ దాటుకొని ఈ వయసులో బంగారం గెలవడం ఎనలేని సంతోషాన్నిస్తోందని చెప్పాడు.