ఎయిరిండియా ఫైల్ ఫోటో
న్యూఢిల్లీ : నేషనల్ క్యారియర్ ఎయిరిండియా.. టెన్నిస్ ప్లేయర్లను వదిలేసి గాలిలోకి ఎగిరిపోయింది. టెన్నిస్ ప్లేయర్లను ఇలా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలోనే వదిలిపోయిన ఘటనకు ఎయిరిండియా క్షమాపణ చెప్పింది. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని, తాము ఆటగాళ్లకు క్షమాపణ చెబుతున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి అన్నారు. తదుపరి అందుబాటులో ఉన్న విమానాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించడంలో ఎయిరిండియా గొప్ప వారసత్వం కలిగి ఉందని, ఆటగాళ్లకు తాము ఎక్కువ గౌరవం కూడా ఇస్తామన్నారు. పలు పీఎన్‌ఆర్‌లలో మెల్‌బోర్న్ విమానాన్ని దేశీయ టేబుల్ టెన్నిస్ టీమ్ బుక్ చేసుకున్నారని, పొరపాటున వీరిలో కొంతమంది ప్రయాణం ఆగిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తర్వాత విమానాలను ఏర్పాటు చేసేంతవరకు క్రీడాకారులకు ఎయిరిండియా హోటల్ సదుపాయం కూడా కల్పించినట్టు ఈ విమానయాన సంస్థ మరో ట్వీట్‌లో చెప్పింది.
అసలేం జరిగిందంటే... ఎయిరిండియా విమానం నెంబర్. ఏఐ0308లో టిక్కెట్లను దేశీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ల టీమ్ బుక్ చేసుకుంది. కామన్ వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ మనీకా బాత్రాతో పాటు ఏడుగురు ప్లేయర్లను ఎయిరిండియా విమానంలోకి అనుమతించలేదు. సీట్లన్నీ బుక్ అయి ఉండటం మాత్రమే కాక, వారి పి.ఎన్.ఆర్. (ప్యాసింజర్ నేమ్ రికార్డ్) నంబర్లు సరిపోలేదని ఎయిర్ ఎండియా విమానం నిరాకరించింది. ఈ విషయంపై మనీకా బాత్రా ట్విటర్ ద్వారా తన బాధను షేర్‌చేసుకున్నారు. క్రీడా మంత్రి రాజ్యవర్థన్ రాథోర్, ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ ట్వీట్ షేర్ చేశారు. దేశీయ టేబుల్ టెన్నిస్ టీమ్‌కు చెందిన మొత్తం 17 మంది క్రీడాకారులు, అధికారులు ఏఐ 0308 విమానంలో మెల్‌బోర్న్‌కు వెళ్లాల్సి ఉంది.
మెల్‌బోర్న్‌లో మొదలౌతున్న ఐ.టి.టి.ఎఫ్. (ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్) వరల్డ్ టూర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ తాము ఎయిరిండియా కౌంటర్ వద్దకు వచ్చిన తర్వాత విమానమంతా ఓవర్‌బుక్ అయినట్టు తెలిసింది. కేవలం 10 మంది మాత్రమే ప్రయాణించడానికి వీలుందని కౌంటర్ వద్ద చెప్పారు. మిగతా ఏడుగురు క్రీడాకారులు ప్రయాణించడానికి వీలులేదు అనే సరికి, క్రీడాకారులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం అని చెప్పింది. సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత స్పోర్ట్ డైరెక్టర్ జనరల్ నీలం కపూర్ వెంటనే స్పందించారు. కొన్ని గంటల తర్వాత మరో విమానంలో వారిని మెల్‌బోర్న్‌కు పంపించేలా కృషిచేశారు. మిగతా క్రీడాకారులకు కూడా మెల్‌బోర్న్ వెళ్లేందుకు బోర్డింగ్ పాస్ దొరకడంతో, మనీకా క్రీడా మంత్రికి, పీఎం ఆఫీసుకు, స్పోర్ట్స్ అథారిటీకి, నీలం కపూర్ మేడమ్‌కి కృతజ్ఞతలు చెబుతున్నట్టు మరో ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment