భర్త, పిల్లలతో జడ్జిగా ఎంపికైన భార్గవి
పట్టుదల, సంకల్పం ముందు కొండంత లక్ష్యం చిన్న బోతుందనేందుకు అతి చిన్నవయస్సులోనే జూనియర్ జడ్జిగా ఎంపికైన భార్గవి ఓ ఉదాహరణ. పెళ్లయిన తర్వాత కూడా చదువును కొనసాగించారీమె. భర్త ఇచ్చిన ప్రోత్సాహం, ప్రేరణతో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి తొలి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించారు. ఈ విజయం కేవలం ప్రణాళిక.. టైం మేనేజ్‌మెంట్‌తోనే సాధ్యమయ్యాయంటారీమె..
మదనపల్లె/తంబళ్లపల్లె : ‘చిన్నప్పటి నుంచి నాకు చదువంటే చాలా ఆసక్తి. ఉన్నతస్థానంలో ఉండాలనేది సంకల్పం. నాన్న రమణారెడ్డి ఆర్‌ఎంపీ వైద్యులు. అమ్మ ఏఎన్‌ఎం. మధ్య తరగతి వ్యవసాయకుటుంబం. తాతలు, తండ్రుల నుంచీ వ్యవసాయంపై ఆధారపడి జీవనం. కష్టాలు ఎదురైనా, ఎందరు విమర్శిం చినా బిడ్డను చదివిం చాలని నన్ను 30కి.మీ. దూరంలోని మదనపల్లెలో ఉంచి చదివించారు. బీఫార్మసీ ఫైనల్ ఇయర్‌లో పెళ్లి చేశారు. పెళ్లి వల్ల నా లక్ష్య సాధన దెబ్బతినలేదు. పట్టుదలతో కొనసాగించాను.
అమ్మగా మారడం..
బీఫార్మసీ తర్వాత ఏడాదిన్నర చదువులో గ్యాప్ ఏర్పడింది. ఇదే సమయంలో ఇద్దరు పిల్లలకు తల్లికావడం జరిగింది. పెద్ద పాప రెండో తరగతి, చిన్నమ్మాయి ఎల్.కే.జి. చదువుతున్నారు. పిల్లలతో సమయం గడచిపోతున్నా మనసులో వెలితిగా ఉండేది. భర్త న్యాయవాద వృత్తిలో ఉండటం, కక్షిదారులు, సహచర న్యాయవాదులు, వాతావరణం, న్యాయమూర్తులకిచ్చే గౌరవం చూశాను. న్యాయవాద వృత్తిపై ఆసక్తిని పెంచాయి. మా ఆయన వృత్తిలో చూపే నిబద్ధత, నిజాయితీ, నైతికత ఆకర్షించాయి. న్యాయమూర్తిగానూ ప్రజాసేవ చేయవచ్చన్న భావన బలపడింది. కడపలోని బసవరాజ తారకం మెమోరియల్ లా కాలేజిలో ఎల్‌ఎల్‌బీ చేరాను. అక్కడ అధ్యాపకులు జావీద్ సార్ ఇచ్చిన గైడెన్స్, తోటి విద్యార్థుల ప్రోత్సాహంతో కాలేజిలో ఎప్పుడూ నేనే మొదటి స్థానంలో ఉండేదాన్ని. గత సంవత్సరం మార్చిలో ఫలితాలు రావడం, ప్రొవిజనల్ సర్టిఫికెట్ వచ్చిన పది రోజులలోపే జడ్జి పోస్టుల నోటిఫికేషన్ వెలువడటం, దరఖాస్తుకు చివరి రెండు రోజుల సమయం ఉందనగా హడావిడిగా అప్లికేషన్ వేయడం చకచకా జరిగిపోయాయి.
రోజుకు నాలుగు గంటలు..
ఇంటిపనులు చూసుకుంటూనే రోజుకు నాలుగు గంటలు పరీక్షకు సంబంధించిన పుస్తకాలను చదివేదాన్ని. ప్రతి అంశాన్ని చదివి అర్థం చేసుకునేదాన్ని. విజయానికి అడ్డదారులు ఉండవని, కష్టపడటం, నిజాయితీనే మనకు గెలుపును తెచ్చి పెడతాయనే మాట నాకు స్ఫూర్తి.. అనుకున్నది సాధించగలిగాను. మధ్య తరగతి కుటుంబాలలో చాలామంది మహిళలు పెళ్లవడంతో చదువును నిలిపేస్తుంటారు. చదవాలనే కోరిక, ఉన్నతస్థానాలకు చేరుకునే తపన ఉంటే ఎవరైనా విజయాలు సాధించవచ్చు. ముఖ్యంగా సమయపాలన ప్రధాన అంశం. టైమ్ మేనేజ్‌మెంట్ కూడా ముఖ్యం. పోటీ పరీక్షలకు అభ్యర్థులు నిరంతర సాధనకు అలవాటు పడాలి. నిరుత్సాహాన్ని దరిచేరనీయకూడదు. విజయం దక్కుతుందనే నమ్మకంతో ముందుకు సాగాలి. పోటీ పరీక్షలకు సంబంధించిన సమాచారం ఎక్కువగా ఇంగ్లిషులోనే అందుబాటులో ఉంటోంది. ప్రణాళిక, కష్టించే మనస్తత్వం, చదవడంలో నిజాయితీ ఉంటే తప్పక విజయం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment