శీలానికి వెల కట్టిన పోలీసు
-డీఎస్పీ ఎదుట బెడిసికొట్టిన పంచాయితీ
చిత్తూరు: ప్రేమించి.. పెళ్ళాడతానని మాట ఇచ్చిన ఓ కానిస్టేబుల్ మరో మహిళా కానిస్టేబుల్‌కు అన్యాయం చేసిన సంఘటన పలమనేరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. పలమనేరు మండలం ముసలిమొడుగుకు చెందిన మోహన్ అనే కానిస్టేబుల్ గత కొన్నాళ్ళుగా కుప్పం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఇదే పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా కేవీ భార్గవి పని చేస్తుంది. ఇరువురూ గత కొన్నాళ్ళుగా ప్రేమించుకున్నారు. ఈ వ్యవహారం పెళ్ళిదాకా వచ్చింది. ఈ నేపధ్యంలో భార్గవి ప్రవర్తన నచ్చని మోహన్ ఆమెను వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు.
దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్గవి డీఎస్పీ శంకర్‌ను కోరింది. ఇరువురిని ఒక్కటి చేసేందుకు డీఎస్పీ ప్రయత్నించగా.. మోహన్ అందుకు నిరాకరించాడు. తనను వదిలేయాలంటే ఆమెకు ఏం కావాలో అడగాలంటూ.. భార్గవి శీలానికి వెలకట్టేందుకు యత్నించాడు. మోహన్ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మోహన్ పెళ్ళికి అంగీకరించకపోవడంతో భార్గవి శుక్రవారం రాత్రి నిద్ర మాత్రలను మింగేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు మోహన్‌పై కేసును నమోదు చేసి విచారిస్తున్నారు.