దిగజారుడు నేతలకు పబ్లిసిటీ ఇవ్వం!.. అన్నామలైపై సీఎం పరోక్ష విమర్శలు | - | Sakshi
Sakshi News home page

దిగజారుడు నేతలకు పబ్లిసిటీ ఇవ్వం!.. అన్నామలైపై సీఎం పరోక్ష విమర్శలు

Published Wed, May 3 2023 1:08 AM | Last Updated on Wed, May 3 2023 1:18 PM

 సీఎం స్టాలిన్‌   - Sakshi

సీఎం స్టాలిన్‌

సాక్షి, చైన్నె: దిగజారుడు రాజకీయాలు చేసే వారికి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వదలచుకోలేదని పరోక్షంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను ఉద్దేశించి సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తానుప్రజా సేవలో బిజీగా ఉన్నానని, అనాగరిక రాజకీయాలు చేసే వాళ్లను పట్టించుకోనని స్పష్టం చేశారు. మీలో ఒకడిని.. పేరిట సామాజిక మాధ్యమాల వేదికగా తనకు వచ్చే ప్రశ్నలకు సీఎం ఎంకే స్టాలిన్‌ సమాధానాలు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

మంగళవారం పలువురు సంధించిన అనేక ప్రశ్నలకు సీఎం జవాబిచ్చారు. ఈ సారి సమాధానాలు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగిందని పేర్కొంటూ, రెండేళ్ల పాలనలో అమల్లోకి తెచ్చిన కీలక పథకాలను, వాటి తీరు తెన్నులను వివరించారు. ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయని, అన్ని రంగాలలో తమిళనాడును నెంబర్‌ –1 చేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్నామని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

సామాజిక న్యాయ రాజధాని..
తమిళనాడు స్వరం భారతదేశ వ్యాప్తంగా మారుమోగిందని, సామాజిక న్యాయానికి తమిళనాడు రాజధానిగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి హక్కుల విషయంలో తగ్గేదే లేదన్నారు. రెండేళ్ల పాలన పూర్తిస్థాయి సంతృప్తిని కలిగించినట్లు పేర్కొన్నారు. ఈ కాలంలో మూడు వంతులకు పైగా హామీలను నెరవేర్చినట్లు వివరించారు. పదేళ్ల అన్నాడీఎంకే పాలన రూపంలో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా దిగజారిందని, దీనిని తాము మళ్లీ నిలబెట్టే ప్రయత్నంలో విజయవంత మయ్యామన్నారు.

అమిత్‌ షాపై ఆగ్రహం
బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం.. అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిని సంతృప్తి పరిచేందుకు మరొకరిపై ద్వేషం పెంచడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ దేశంలో హిందూ, ముస్లింలు సోదర భావంతో మెలుగుతున్నారని పేర్కొన్నారు. ద్వేష పూరిత రాజకీయాల వైపుగా బీజేపీ ముందుకెళ్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రజలు నిశితంగానే గమనిస్తున్నారని పేర్కొన్నారు.

చౌకబారు విమర్శలను పట్టించుకోం..
ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ చేసిన వ్యాఖ్యలుగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాలలలో జరుగుతున్న ఆడియో ప్రచారం గురించి సీఎం స్పందించారు. ఇప్పటికే మంత్రి రెండు సార్లు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజా సేవలో తాను బిజీగా ఉన్నానని, చౌక బారు విమర్శలు, ఆరోపణల గురించి పట్టించుకోదలచుకో లేదన్నారు.

అన్నామలైను ఉద్దేశించే ఈ00 వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఇక దివంగత నేత కరుణానిధి శత జయంతి వేడుకలను ఈ ఏడాది పొడవున బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనుండడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల విజ్ఞప్తులను అర్థం చేసుకోవడం, వారి గళానికి గౌరవం ఇచ్చే విధంగా ముందుకెళ్లడం తన అభిమతంగా పేర్కొన్నారు. అన్నాడీఎంకే పాలనలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని, అవినీతి కేసుల్లో అందరినీ కచ్చితంగా కోర్టు బోనులో నిలబెడుతామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement