సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సర్కారు విద్యుత్ శాఖలో భారీగా మార్పులు చేపట్టింది. ఆయా విద్యుత్ సంస్థల సారథ్య బాధ్యతల్లో ఉన్న రిటైర్డ్ విద్యుత్ శాఖ అధికారుల (నాన్ ఐఏఎస్)ను తొలగించి.. ఐఏఎస్ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్‌తోపాటు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, ఇన్‌చార్జి డైరెక్టర్ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని ఇంధనశాఖ కార్యదర్శిగా నియమించారు. అంతేగాక రాష్ట్ర విద్యుత్ శాఖలో కీలకమైన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీగా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్‌కో, జెన్‌కోలకు సీఎండీగా దాదాపు పదేళ్లు కొనసాగిన డి.ప్రభాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాజీనామా చేశారు. దీంతో సర్కారు కొత్త సీఎండీని నియమించింది. ముర్తుజా రిజ్వీ 2013 జూలై 2 నుంచి 2014 జూలై 19 వరకు టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీగా వ్యవహరించారు.
యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌కు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. మరోవైపు కీలకమైన ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ ఝాను ప్రభుత్వం నియమించింది. గత ఎనిమిదేళ్లుగా ఈ పోస్టులో కొనసాగిన సి.శ్రీనివాసరావుకు ఉద్వాసన పలికింది.
డిస్కంలకు యువ అధికారులు: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు అధిపతులుగా యువ ఐఏఎస్ అధికారులను సర్కారు నియమించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్‌లో ఉన్న 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ముషార్రఫ్ అలీ ఫారూఖీని.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) సీఎండీగా వెయిటింగ్‌లో ఉన్న 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్‌రెడ్డిని నియమించింది. ఐటీ–ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న సందీప్‌కుమార్ ఝాను ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ)గా బదిలీ చేసింది.
టీఎస్‌ఎన్పిడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు తన పదవికి రాజీనామా చేయగా, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఇప్పటివరకు పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో రఘుమారెడ్డికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయనను కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆయనను తప్పించారు. ఇక కేంద్ర డెప్యుటేషన్ నుంచి తిరిగొచ్చి వెయిటింగ్‌లో ఉన్న కాటా ఆమ్రపాలిని హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. వెయిటింగ్‌లో ఉన్న బి.గోపికి వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది.
త్వరలో కొత్త డైరెక్టర్లు కూడా..!
రాష్ట్ర విద్యుత్ సంస్థలకు కొత్త సీఎండీలను నియమించిన ప్రభుత్వం.. త్వరలో కొత్త డైరెక్టర్లను సై తం నియమించనున్నట్టు చర్చ జరుగుతోంది. ప్ర స్తుతం ట్రాన్స్‌కోలో నలుగురు, జెన్‌కోలో ఆరుగు రు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఏడుగురు, టీఎస్‌ఎన్పి డీసీఎల్‌లో ఆరుగురు డైరెక్టర్లు పనిచేస్తున్నారు. వారిలో కొందరు ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి, మరికొందరు తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. కొన్ని సంస్థల్లో నిర్దేశిత సంఖ్యకు మించి డైరెక్టర్లు ఉన్నారు. ఈ క్రమంలో దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న డైరెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినట్టు
తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment