సాక్షి, హైదరాబాద్: వచ్చే సంవత్సరంలో 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నాయి. ఈ మేరకు సాధారణ, ఐచ్చిక సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ సాధారణ సెలవులు, ఐచ్చిక సెలవులను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అన్ని ఆదివారాలు, అన్ని రెండో శనివారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసి ఉంచాలని ఆదేశించారు. 2024 జనవరి 1న సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం (ఫిబ్రవరి 10) రోజును పనిదినంగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 25 ఐచ్ఛిక సెలవుల్లో గరిష్టంగా 5 సెలవులను మాత్రమే వినియోగించాలని కోరారు. తమ ఇష్టాలకు అనుగుణంగా మతాలతో సంబంధం లేకుండా ఏదైనా పండుగకి సంబంధించిన ఐచ్చిక సెలవును ఉద్యోగులు వాడుకోవచ్చని తెలిపారు.
అయితే దీనికోసం పైఅధికారికి ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు వర్తించవని స్పష్టం చేశారు. సంబంధిత సంస్థలే సెలవులపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయన్నారు. నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ పర్వదినాల సెలవులను తర్వాత మారుస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment