
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ(బుధవారం) బిఆర్కేఆర్ భవన్ లో అధికారులతో రాష్ట్రాల స్వంత పన్నులు పన్నుయేతర ఆదాయాల రూపంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, మైనింగ్ తదితర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ ఏడాది లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లను పెంచేందుకు అవసరమైతే ప్రత్యేక చర్యలను చేపట్టాలని అధికారులను సీఎస్ కోరారు. ప్రతి వారం సమీక్షలు నిర్వహించి లక్ష్యాలను చేరుకోవాలని ఆమె తెలిపారు. ఆదాయాన్ని ఆర్జించే శాఖలైన కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, రవాణా శాఖలు అదనపు ఆదాయాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించాలని కోరారు.
ఈ ఏడాది జనవరి చివరి నాటికి పన్నుల వసూళ్లలో రూ. 91,145 కోట్లు, పన్నుయేతర ఆదాయంలో రూ. 6996 కోట్లు మొత్తం రూ. 98,141 కోట్లుగా ఆదాయం సమకూరిందని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. కమిషనర్ ఇన్‌స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రాహుల్ బొజ్జా, కమీషనర్, కమర్షియల్ టాక్సెస్ నీతూ కుమారి ప్రసాద్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, డైరెక్టర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్ఫరాజ్ అహ్మద్, రవాణా శాఖ కమీషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి మరియు ఇతర అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment