వైన్‌ షాపుల లైసెన్సులకు లాటరీ.. ఉత్తర్వులు జారీ.. రూ.2 వేల కోట్ల ఆదాయం! | Allocation of wineshops is as per Old Testament | Sakshi
Sakshi News home page

వైన్‌ షాపుల లైసెన్సులకు లాటరీ.. ఉత్తర్వులు జారీ.. రూ.2 వేల కోట్ల ఆదాయం!

Published Thu, Aug 3 2023 4:54 AM | Last Updated on Thu, Aug 3 2023 11:14 AM

Allocation of wineshops is as per Old Testament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే రెండేళ్లకు ఏ4 (వైన్‌) షాపులకు లైసెన్సులు కేటాయించే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు లైసెన్సుల జారీకి సంబంధించిన నిబంధనలతో కూడిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సీఎస్‌ శాంతికుమారి జారీ చేసిన జీఓ నంబరు 86 ప్రకారం పాత పాలసీలోని నిబంధనల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి, నవంబర్‌ 30, 2025 వరకు మద్యం విక్రయించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 2,620 షాపులకు లైసెన్సులు జారీ చేస్తారు. ఇందుకు లాటరీ పద్ధతినే పాటిస్తారు. దరఖాస్తు ఫీజు కూడా గతంలో లాగానే రూ.2లక్షలుగా ఉంటుంది.

ఎక్సైజ్‌ ఫీజు శ్లాబులూ, ఇతర నిబంధనలన్నీ గత పాలసీ మేరకే ఉంటాయి. గతంలో మాదిరిగానే గౌడ సామాజికవర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్ల ప్రకారమే జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలో ఎన్ని షాపులు కేటాయించాలో బుధవారమే నిర్ణయించారు. ఈ షాపుల సంఖ్య ప్రకారం గురువారం ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రాలు నిర్వహించి ఏ షాపులు ఏ ఏ వర్గాలకు కేటాయించాలో నిర్ణయిస్తారు.

ఇతర షాపులకు కూడా లాటరీ పద్ధతిలోనే లైసెన్సులు ఇస్తారు. లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో గతంలో నిర్వహించిన విధంగానే జరుగుతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైన్‌ షాపుల కేటాయింపు ద్వారా ఈసారి కూడా రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.  

ఏ4 షాపుల కేటాయింపు నిబంధనలు ఇలా... 
లైసెన్సులకు గత పాలసీ మాదిరిగానే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజులోనూ ఎలాంటి మార్పు లేదు. రూ.2లక్షలు దరఖాస్తు కోసం చెల్లించాలి. లాటరీ వచి్చనా రాకపోయినా ఆ డబ్బులు ప్రభుత్వానికే జమవుతాయి. ఒకరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు.  
 రెండేళ్ల పాటు మద్యం విక్రయించుకునే ఫీజు గతంలోలాగే ఉంచారు. పాత స్లాబుల ప్రకారమే ఫీజులు నిర్ధారించారు. 5వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.50 లక్షలు, 5–50వేల జనాభా వరకు రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి 5లక్షల జనాభా వరకు రూ.65లక్షలు, 5 నుంచి 20లక్షల జనాభా వరకు రూ.85లక్షలు, 20లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో షాపులకు రూ.1.10 కోట్లు ఎక్సైజ్‌ ఫీజుగా నిర్ణయించారు.  
 జీహెచ్‌ఎంసీ పరిధిలోని షాపులకు వర్తించే స్లాబు, జీహెచ్‌ఎంసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే షాపులకు, ఇతర కార్పొరేషన్లకు వర్తించే స్లాబులను కూడా ఐదు కిలోమీటర్ల పరిధిలోని షాపులకు వర్తింపజేస్తారు. మున్సిపాలిటీలకు వర్తించే స్లాబును ఆయా మున్సిపాలిటీలకు రెండు కిలోమీటర్ల దూరంలోని షాపులకు కూడా వర్తిస్తుంది.  
 లైసెన్స్‌ ఫీజు ప్రతి ఏడాది ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చు. అంటే రెండేళ్లలో 12 సార్లు ఫీజు చెల్లించాలి. ఇందుకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ కింద మొత్తం ఫీజులో 25 శాతానికి ఇస్తే సరిపోతుంది.  
గతంలో మాదిరిగానే దరఖాస్తుతోపాటు ధరావతు (ఈఎండీ) చెల్లించాల్సిన అవసరం ఉండదు.  
 మద్యం విక్రయాల ద్వారా లైసెన్సీలకు కమిషన్‌ (మార్జిన్‌) కూడా గతంలో ఉన్న విధంగానే నిర్ణయించారు. వార్షికఫీజు కంటే 10 రెట్ల టర్నోవర్‌ వరకు 27 శాతం మార్జిన్‌ ఇస్తారు. మీడియం, ప్రీమియం బ్రాండ్లపై 20 శాతం, బీర్లపై 20 శాతంగా మార్జిన్‌ నిర్ధారించారు. పదిరెట్ల టర్నోవర్‌ దాటిన తర్వాత మాత్రం అన్ని బ్రాండ్లకు 10శాతం మార్జిన్‌ మాత్రమే ఇస్తారు.  
 పర్మిట్‌రూం కోసం అదనంగా ఏడాదికి రూ.5లక్షలు చెల్లించాలి. వాకిన్‌స్టోర్‌ కావాలంటే మరో రూ.5లక్షలు చెల్లించాలి.  
  జీహెచ్‌ఎంసీ, పరిసర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. మద్యం బాటిల్‌ లేబుల్‌పై ఉన్న ధరకు మాత్రమే విక్రయించాలి. ప్రతి షాపులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ద్వారా కేటాయింపబడని షాపులకు మళ్లీ టెండర్లు పిలవాలా లేక అవుట్‌లెట్లు ఏర్పాటు చేయాలా అనే దానిపై ఎక్సైజ్‌ కమిషనర్‌ నిర్ణయం తీసుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement