జలాశయాల్లో సరిపడా నిల్వలున్నాయి
సీఎస్ శాంతికుమారి స్పష్టీకరణ
తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన మూడు జలాశయాలైన శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్‌లలో గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ సరిపడా నీటి లభ్యత ఉన్నందున ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తాగునీటి సరఫరాను సమీక్షించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ‘వేసవి కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించి జిల్లాలకు తగు నిధులను కూడా విడుదల చేసినట్లు సీఎస్ తెలిపారు. తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు పూర్తి చేయడం జరిగిందన్నారు. నిరంతర నీటి సరఫరా కొనసాగింపునకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లోని తాగునీటి సమస్యను మన రాష్ట్రానికి కూడా అన్వయిస్తూ ఆందోళనకరమైన వార్తా కథనాలు రాయడం సరికాదన్నారు. ఏప్రిల్ రెండో వారం అనంతరం రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్‌ను చేపడతామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో కూడా సరిపడా నీటి సరఫరా చేస్తున్నామని, వాణిజ్య అవసరాల నిమిత్తం డిమాండ్ ఎక్కువగా ఉందని జలమండలి అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment