
సాక్షి నెట్‌వర్క్: గత కొన్ని రోజులుగా రాష్ట్రానికి ముఖం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. ఆందోళనలో ఉన్న అన్నదాతను ఆనందంలో ముంచెత్తుతూ ఎండుతున్న చేలకు ఊపిరి పోశాడు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి రాత్రి దాకా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఇన్ని రోజులు బోసిపోయిన చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటున్నాయి. వాగులు, వంకలు వరదతో ఉరకలెత్తుతున్నాయి. పలుచోట్ల వాగులు అలుగుపారుతున్నాయి. వివిధ ప్రాజెక్టుల్లోకి క్రమంగా ప్రవాహాలు చేరుతున్నాయి.
వాగుల్లో వరద ఉధృతి: ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి–చెల్పాక గ్రామానికి మధ్యలో ప్రవహిస్తున్న దయ్యాలవాగు (జంపన్నవాగు)తోపాటు వెంకటాపురం (కే) మండలంలోని కంకలవాగు, రాచపల్లి వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
కన్నాయిగూడెం మండలంలోని దొంగలగుట్ట వాగు రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తోంది. అదేవిధంగా ఏడాగుల కలయికతో హనుమంతుని వాగు పొంగి పొర్లుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆవతలి వైపున ఉన్న వివిధ గూడేల్లోని గర్భిణులను ముందస్తుగా ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రాణహిత పరవళ్లు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర నుంచి తరలివస్తున్న ప్రాణహిత నది గోదావరితో కలిసి పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం సాయంత్రం కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్‌ను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది.
తడిసి ముద్దయిన ఉమ్మడి ఆదిలాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు 8.2 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. కుమురం భీం (ఆడ) ప్రాజెక్టులో ఒక గేటును 0.10 మీటర్ల మేర పైకెత్తి 208 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.629 టీఎంసీల నీరుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్‌పల్లి, భీమ్‌గల్, సిరికొండ, నవీపేట్, తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కమ్మర్‌పల్లి మండలంలో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
కామారెడ్డి పట్టణం నుంచి రాజంపేట మండలం మీదుగా మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డుపై కొండాపూర్ శివారులో వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా తాత్కాలికంగా వేసిన రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద కొడప్‌గల్ మండలంలో పోచారం గ్రామానికి వెళ్లే రోడ్డుపై ఉన్న కాజ్‌వేపై భారీగా వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. మంగళవారం రాత్రి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment