
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌తోపాటు, కమిషన్ సభ్యులు వచ్చే నెల 3వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. 5వ తేదీవరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సభ్యులు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఈసీ పర్యటన నేపథ్యంలో సీఎస్ శుక్రవారం సచివాలయంలో సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు తమ మూడు రోజుల పర్యటనలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు/సీపీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారని సీఎస్ అధికారులకు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున వాటికి సంబంధించిన అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, అధికారులు అన్ని వివరాలను ఒకే పద్ధతిలో అందించాలని ఆమె సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల వివరాలను నివేదికల్లో పొందుపరచాలని, సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి దివ్యాంగుల కోసం వీల్‌చైర్‌లు కొనుగోలు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచాలని చెప్పారు. అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఏఈఆర్‌ఓ), ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, సమీకృత సరిహద్దు చెక్‌పోస్టుల వివరాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అందుబాటులో ఉంచాలని ఆమె ఆదేశించారు.
ఈ సమావేశంలో సీఈవో వికాస్ రాజ్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోం శాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment