గ్రూప్–1 పరీక్షల నిర్వహణపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
4.03 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం
897 కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా చేయాలి
20 పరీక్షా కేంద్రాలకో రీజినల్ కోఆర్డినేటర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నెల 9న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజినల్ కో ఆర్డినేటర్‌ను కూడా నియమించినట్లు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షల ఏర్పాట్లతో పాటు విత్తనాలు, ఎరువుల సరఫరా, మిషన్ భగీరథ, గ్రామాల్లో ఇంటింటి సర్వే, జిల్లాల్లో పాఠశాలలకు స్కూల్ యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై సీఎస్ గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ని ర్వహించారు. గ్రూప్– 1 పరీక్షల ఏర్పాట్లను టీజీపీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని నిశితంగా పరిశీలించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో తక్షణమే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
విత్తనాల బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా
బ్లాక్ మార్కెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను సీఎస్ అభినందించారు. రానున్న మూడు వారాల పాటు నిఘా కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్యాక్ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్ర గోడౌన్ల నుంచి మండల స్థా యి గోడౌన్ల వరకు ఎరువుల తరలింపును పర్యవేక్షించి సక్రమంగా అందేలా చూడాలని, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రతి విద్యారి్థకీ కనీసం జత యూనిఫాం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా? లేదా అనే విషయాన్ని నిర్ణిత గడువులోగా సర్వే చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభించే నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీజీపీ రవిగుప్తా, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘు నందన్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ దివ్య, టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment