ఇంకా రుణమాఫీ అందని రైతులు..1.6 లక్షలు రాష్ట్ర ఆర్థికశాఖ  | Harish rao : farmers loans waived in TS | Sakshi
Sakshi News home page

ఇంకా రుణమాఫీ అందని రైతులు..1.6 లక్షలు రాష్ట్ర ఆర్థికశాఖ 

Published Tue, Sep 5 2023 2:43 AM | Last Updated on Fri, Sep 15 2023 4:05 PM

Harish rao : farmers loans waived in TS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వీరికి వెంటనే రుణమాఫీ సొమ్ము అందజేయాలని ఆదేశించారు. రైతు రుణమాఫీపై సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో బ్యాంకర్లతో హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఉన్నత­స్థాయి సమీక్ష జరిగింది.

దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, స్పె­ష­ల్‌ సీఎస్‌ రామకృష్ణరావు, వివిధ బ్యాంకుల అధి­కారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... రుణ­మాఫీకి సంబంధించి ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే రూ.లక్షలో­పు రుణాలు మాఫీ చేసిందన్నారు. మిగతా­వారికి ప్రాధాన్యక్రమంలో రుణమాఫీ జరు­గు­తుందన్నారు.

ఇప్పటివరకు 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9,654 కోట్లు ఆర్థిక­శాఖ విడుదల చేసిందన్నారు.17.15 లక్షల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరా­య­న్నారు. బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవడం, అకౌంట్లు క్లోజ్‌ చేయడం, అకౌంట్‌ నంబర్లు మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమ­స్య తలెత్తినట్టు ఆయనకు అధికారులు వివరించారు. చర్చించిన అనంతరం మూడు పరిష్కా­రమా­ర్గాలు కనుగొన్నారు.

  • ఆధార్‌ నంబర్ల సాయంతో రైతుబంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణమాఫీ డబ్బు వేయడం, దీనివల్ల సుమారు మరో లక్షమందికి రుణమాఫీ డబ్బు అందుతుంది.
  • ఎన్‌పీసీఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థికశాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూ­డు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయించారు.
  •  మిగతా 16 వేల మందికి సంబంధించి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాలు పరిశీలిస్తారు. ఆ సమా­చారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 

రుణమాఫీ సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయి గ్రీవెన్స్‌సెల్‌
రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్రస్థాయిలో గ్రీవెన్స్‌సెల్‌ ఏర్పాటు చేయాలి.. ఒక అధికారిని నియమించి, వారి ఫోన్‌నంబర్, ఈ మెయిల్‌ ఐడీని ప్రజలకు తెలియజేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రైతులు ముందుగా బ్యాంకుస్థాయిలో సంప్రదిస్తారు..అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్రస్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకొనేలా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే తరహాలో వ్యవసాయశాఖ తరపున జిల్లాకు ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామన్నారు.

కొత్త రుణాలు మంజూరు చేయాలి 
రుణమాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయాలని మంత్రి హరీ­శ్‌­రావు అన్నారు. పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని చెప్పారు. రుణమాఫీ పొందినవారిలో ఇప్పటి వరకు 35 శాతం మందికి మాత్రమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెబుతున్నాయన్నా­రు. ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యూవల్‌ పూర్తి కావాలన్నారు.

ప్రభుత్వం మాఫీ చేసిన రూ.­9,654 కోట్ల మేర తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలన్నారు. కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహ­కా­రంతో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రుణమాఫీ, పంట రుణాల రెన్యూవల్‌పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణమాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, పలు ఆదేశాలు జారీ చేశారు. రుణ మాఫీ సంబంధిత అన్ని సమస్యలు పరిష్కరించి రైతులకు రుణాలు అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement