
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం నియమించిన సలహాదారుల పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్‌శర్మ, డీజీపీగా కొనసాగిన అనురాగ్ శర్మలు ఇంతకాలం సలహాదారులుగా కొనసాగుతున్నారు. వారి పదవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సీఎస్ శాంతికుమారి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పదవులు కోల్పోతున్న వారిలో రాజీవ్‌శర్మ (ప్రభుత్వ ముఖ్య సలహాదారు), అనురాగ్‌శర్మ (శాంతిభద్రతలు, నేర నిరోధక సలహాదారు), ఏకే ఖాన్ (మైనారిటీ సంక్షేమం సలహాదారు), జీఆర్ రెడ్డి (ఆర్థిక సలహాదారు), ఆర్.శోభ (అటవీ వ్యవహారాలు), సోమేశ్‌కుమార్ (ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు), డాక్టర్ చెన్నమనేని రమేశ్ (వ్యవసాయ ముఖ్య సలహాదారు) ఉన్నారు. వీరి పదవీ కాలం శుక్రవారంతోనే ముగిసిందని సీఎస్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.