రైతులకు సాయంపై తక్షణ చర్యలు | Kcr suggested to collect full details on crop damage | Sakshi
Sakshi News home page

రైతులకు సాయంపై తక్షణ చర్యలు

Published Wed, Mar 29 2023 3:24 AM | Last Updated on Wed, Mar 29 2023 3:24 AM

Kcr suggested to collect full details on crop damage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్‌ శాంతికుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం తదితర అంశాలపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

సీఎస్‌తో పాటు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్‌ మిత్తల్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌ రావు, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శులు రాజశేఖర్‌ రెడ్డి, భూపాల్‌ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వడగండ్ల వానలతో రైతులకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగు జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నష్ట పోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో (ఏఈవో) సర్వే చేయించి పంట నష్టంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు.  

కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు.. 
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు.ఖాళీ జాగాలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు జారీ చేయాలని సూచించారు. 

త్వరలో పోడు పట్టాల పంపిణీ 
రాష్ట్రంలో అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధతపై సీఎం సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి, 1.55 లక్షల మంది అర్హులకు పట్టాలు అందించేందుకు పాస్‌ బుక్కులు ముద్రించి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. దీంతో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ తేదీని త్వరలో ప్రకటిస్తామని కేసీఆర్‌ చెప్పారు. 

శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి రూపాయలు మంజూరు
శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలను కేసీఆర్‌ మంజూరు చేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో.. దేవాదాయ శాఖ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement