
ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: మరో 17 రోజుల్లో కొత్త సచివాలయ భవనం ప్రారంభంకానుంది. 8 అంతస్తులున్న ఈ భవనంలోని ఆరో అంతస్తు మినహా మిగిలినవాటిలోకి సందర్శకులను పరిమితంగా అనుమతించనున్నారు. ఈ చాంబర్‌లో ముఖ్యమంత్రి కొలువుదీరనున్న దృష్ట్యా అధికారులు భద్రతాపరమైన ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లో ఈ నెల 17న ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ భవనసముదాయంలో 300 సీసీ టీవీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
సీసీటీవీలతోపాటు ఇతర భద్రతాచర్యల పర్యవేక్షణకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయ సందర్శకులకు కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ప్రత్యేకంగా గుర్తింపుకార్డులను జారీ చేసి, వారి కదలికలను కనిపెట్టాలని సూచించారు. సీఎం చాంబర్ ఉండే 6వ అంతస్తు మినహా అన్ని అంతస్తుల్లో సందర్శకులను పరిమితంగా అనుమతించాలని నిర్ణయించారు. కొత్త సచివాలయంలో భద్రతా ఏర్పాట్లతోపాటు ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ–రేసింగ్ ఏర్పాట్లపై మంగళవారం ఆమె డీజీపీ అంజనీకుమార్‌తో కలిసి బీఆర్‌కేఆర్ భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
5 నుంచి రోడ్ల మూసివేత!
ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ–రేస్ జరగనున్న నేపథ్యంలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఖైరతాబాద్ బ్రిడ్జీ, మింట్ కాంపౌండ్ నుంచి ఐ–మాక్స్ వరకు రోడ్లను ఫిబ్రవరి 5 నుంచి మూసివేయాలని సమీక్షలో నిర్ణయించారు. ప్రత్యామ్నాయ మార్గాలపై నగరవాసులకు అవగాహన కల్పించాలని సీఎస్ ఆదేశించారు. ఫార్ములా ఈ–రేస్ సందర్భంగా సచివాలయ పనులకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఉన్నతస్థాయి సమీక్షలోని నిర్ణయాలు
►ఫిబ్రవరి 17న ప్రారంభించనున్న కొత్త సచివాలయానికి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి.
►పోలీస్, రోడ్లు, భవనాలు, జీఏడీ, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఐటీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలి.
►3 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, 300 మంది సిటీ పోలీస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలి.
►సిటీ ట్రాఫిక్ విభాగం నుంచి 22 మంది ట్రాఫిక్ అధికారుల కేటాయింపు
►భద్రతలో భాగంగా బ్యాగేజ్, వెహికిల్, బాడీ స్కానర్లు, ఇతర పరికరాలను సమకూర్చుకోవాలి.
►మొత్తం 28 ఎకరాల్లో 9.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ నూతన సచివాలయంలో 560 కార్లు, 900పైగా ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు సదుపాయం
►సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టులు
►34 సిబ్బందితో రెండు ఫైరింజన్ల ఏర్పాటు. సచివాలయ భవనంలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు,
►దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
►ఇప్పటికే జలమండలి ద్వారా నీటి సరఫరాకు చర్యలు. సీవరేజ్ పనుల పురోగతి.