శ్రీవారి లడ్డూలో కాదు.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ మాటల్లోనే ఉంది కల్తీ | Bhumana Karunakar Reddy Slams Pawan Kalyan and Chandrababu Naidu Over Tirumala Laddu Controversy | Sakshi
Sakshi News home page

శ్రీవారి లడ్డూలో కాదు.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ మాటల్లోనే ఉంది కల్తీ

Published Tue, Feb 11 2025 7:23 PM | Last Updated on Tue, Feb 11 2025 8:30 PM

Bhumana Karunakar Reddy Slams Pawan Kalyan and Chandrababu Naidu Over Tirumala Laddu Controversy

సాక్షి,తిరుపతి:  తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సిట్‌ జరిపిన అరెస్టులకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టుల్లో ఎక్కడా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు పేర్కొనలేదని టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు సహా ఎల్లో మీడియా.. నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్‌  నిర్ధారించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి, ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపకపోతే దేవదేవుని ఆగ్రహానికి గురవడం ఖాయమని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ మాటలు, ఆలోచనల్లోనే కల్తీ కొవ్వు ఉందని.. లడ్డూకి వాడే నెయ్యిలో కల్తీ జరిగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఆ విషయం రిమాండ్‌ రిపోర్టులో లేదు:
 నిందితుల రిమాండ్‌ రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగిందని సిట్‌  చెప్పలేదు. అయినా టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు సహా ఎల్లో మీడియాలో మాత్రం నెయ్యి కల్తీ జరిగిందని నిర్ధారణ జరిగిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బోలే బాబా డెయిరీ, వైష్ణవి డెయిరీ, ఏఆర్‌ డెయిరీ చేసిన తప్పులపై మాత్రమే సిట్‌ విచారణ జరిపి రిమాండ్‌ బాధ్యులను రిమాండ్‌కి తరలించింది. సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ డైరెక్టర్‌ ఆధ్వర్యంలోని సిట్‌ బృందం ఎక్కడా నెయ్యి కల్తీపై మాట్లాడలేదు. టెండర్ల అవకతవకలపై మాత్రమే విచారణ జరుగుతోంది. దానికి సంబంధించే నలుగురిని అరెస్టు చేశారు.

అయినా నిస్సిగ్గుగా దుష్ప్రచారం:
కానీ, చంద్రబాబు మాత్రం వైఎస్సార్సీపీ మీద నిందలు మోపడానికి లడ్డూ తయారీ కోసం పంది కొవ్వును ఉపయోగించారని ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచారు. పవన్‌ కళ్యాణ్‌ మరింత ముందుకెళ్లి సనాతన ధర్మ పరిరక్షణ కోసం తానే ఆవిర్భవించినట్టు వేషం కట్టి బిల్డప్‌ ఇచ్చాడు. తిరుపతిలో పవన్‌ ముందుకు వెళ్లి పవానంద స్వామి వేషంలో సనాతనధర్మం కోసం నడుం బిగించాను అని, తిరుపతిలో లడ్డూను నీచులు అపవిత్రం చేశారు అని మాట్లాడారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలే పంపారని డిప్యూటీ సీఎం పవనానంద స్వామి తీవ్రమైన నిరాధార ఆరోపణలు చేశారు..నిజానికి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిన లక్ష లడ్డూల తయారీకి కావాల్సిన నెయ్యిని చంద్రబాబు నియమించిన టీటీడీ బోర్డులోనే సభ్యుడిగా ఉన్న ముంబైకి చెందిన సౌరభ్‌ బోరా అనే వ్యక్తి సరఫరా చేశాడు. పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే ముందుగా ఆ సౌరభ్‌ బోరాను అరెస్ట్‌ చేయాలి.

కల్తీ నెయ్యి వినియోగించే ఛాన్స్‌ లేనేలేదు:
చంద్రబాబు తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా క్షుద్ర రాజకీయాల కోసం అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని కూడా వాడుకున్నాడు. నెయ్యి నాణ్యతను నిర్ధారించే పటిష్టమైన వ్యవస్థ టీటీడీలో దశాబ్దాలుగా ఉంది. గత మా వైఎస్సార్సీపీ పాలనలో 2019–24 మధ్య నాణ్యత పరీక్షల్లో విఫలమైన 18 ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగింది. అంతకుముందు కూడా ఇదే విధంగా చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య 15 ట్యాంకర్లు తిప్పి పంపించడం జరిగింది. నెయ్యి నాణ్యత టెస్టుల్లో ఫెయిలైతే ట్యాంకర్లను వెనక్కి పంపడమే తప్ప వాడటం అనేది జరగదు.

టీటీడీ ఈఓ కూడా ఏమన్నారు?:
తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని ఈవో శ్యామలరావు చెప్పారు. జూన్‌ 12, 20, 25, జూలై4న వచ్చిన నెయ్యిని పరిశీలించి టెస్టులు పాసయ్యాక వినియోగానికి పంపించామని, గత సెప్టెంబరు 20న టీటీడీ ఈవో శ్యామలారావు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా జూలై 6, 12న ఏఆర్‌ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్ల శాంపిల్స్‌ పరీక్షించగా,వనస్పతి ఆయిల్‌ కలిసిన ఆనవాళ్లు తేలడంతో, ఆ ట్యాంకర్లు వెనక్కి పంపామని చెప్పారు. కాబట్టి, లడ్డూల తయారీలో ఎక్కడా కల్తీ నెయ్యి వాడలేదని స్పష్టంగా తేలిపోయింది.

 పెరిగిన నెయ్యి నాణ్యత:
2019కి పూర్వం నెయ్యి నాణ్యత నిర్ధారణకు హెల్త్‌ ఆఫీసర్‌ మాత్రమే ఉండేవాడు. తిరుమల నెయ్యి నాణ్యతను మరింత పెంచడంలో భాగంగా వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస స్వామి అనే రిటైర్డ్‌ సైంటిస్టుని సీఎఫ్‌టీఆర్టీఐ నుంచి టీటీడీ ల్యాబరేటరీకి తీసుకురావడం జరిగింది. ఆయనతో పాటు మరో 12 మందిని ల్యాబ్‌ టెక్నీషియన్లను కూడా నియమించడం జరిగింది. దీంతో పాటు రకరకాల ప్రాంతాల్లో ట్యాంకర్ల నుంచి శాంపిల్స్‌ సేకరణ విధానాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది.  ల్యాబ్‌ అప్‌గ్రేడేషన్‌ చేయడం కోసం కమలవర్థన్‌ అనే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సూచనలు తీసుకోవడం జరిగింది. ఎన్డీడీబీ సాయంతో రూ.46 కోట్లతో ల్యాబ్‌ ఆధునికీకరణ చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.8 కోట్ల పనులకు టెండర్లు పిలవడం జరిగింది. కానీ ఒకే కంపెనీ ముందుకుడరావడంతో టెండరింగ్‌ ఆలస్యమైంది.

నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం:
‘మేం ఆరోపణలు చేస్తాం.. వైఎస్సార్‌సీపీ తుడుచుకోవాలి’.. అన్నట్లుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ వ్యవహరిస్తున్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అనేలా తొందర్లోనే చంద్రబాబుకి వినాశనం తప్పదు. సర్వం ఎరిగిన స్వామికి ఆగ్రహం కలిగిస్తే వీరి పీఠాలే కదిలిపోతాయని గుర్తుంచుకోవాలి. వైఎస్సార్సీపీ మీద దాడి చేయడానికి, వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి తిరుమల స్వామి వారిని వాడుకోవడం అన్నది చాలా దారుణమైన విషయం. నెయ్యిలో కల్తీ జరిగిందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. ఆవులు తినే ఆహారాన్ని బట్టి రిపోర్టుల్లో తేడాలు రావొచ్చని, మా నివేదిక నూటికి నూరుపాళ్లు ప్రామాణికం కాదని ఎన్డీడీబీ కూడా తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అందుకే ఇకనైనా ఎల్లో మీడియా దేవదేవుని విషయంలో అసత్య ప్రచారం మానుకోవాలని భూమన కరుణాకర్‌రెడ్డి హితవు పలికారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement