సీఎం చంద్రబాబు ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ ‘భూమన’ డిమాండ్
ఆరోపణలు నిజమైతే కల్తీ కారకులు రక్తం కక్కుకుని చావాలి
ఆ తప్పు మేం చేసి ఉంటే మేమూ చావాలి
మైసూరులోని కేంద్ర ప్రభుత్వ ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు?
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమే అయితే.. లడ్డూలో కల్తీ నెయ్యి కారకులు రక్తం కక్కుకుని చావాలి. మేం తప్పుచేసి ఉంటే కూడా రక్తం కక్కుకుని చావాలని స్వామిని కోరుతున్నా. ఆరోపణలు అబద్ధమైతే చంద్రబాబుని శ్రీ వేంకటేశ్వరస్వామే శిక్షిస్తారు’.. అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఘాటుగా స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపించడానికి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై భూమన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సాక్షాత్తు శ్రీవారి మహాప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి తప్పు చేశారన్నారు. ఆయనింకా ఏమన్నారంటే..
నెయ్యి కాదు.. బాబే కల్తీ
హత్యా రాజకీయాలు కంటే ఘోరమైన ఆరోపణ చంద్రబాబు చేశారు. ఆయన చేసిన ఆరోపణలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి. టీటీడీ ఈఓ శ్యామలరావు మొదట నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ప్రకటించారు. సీఎం చంద్రబాబు బెదిరించిన తరువాత ఈఓ మాట మార్చారు. నెయ్యిలో పంది కొవ్వు, చేప నూనె ఉన్నాయన్నారు. మీ పాలనలో అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా ఎలా జరిగిందో మీకు తెలీదా? మీ పాలనలో సరఫరా చేసిన నెయ్యి కంపెనీలే కదా మా హయాంలోనూ సరఫరా చేసింది వాస్తవం కాదా? నిజానికి.. కలుíÙతం అయ్యింది నెయ్యి కాదు చంద్రబాబే. అసలు మైసూరులో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఎఫ్‌టిఆర్‌ఐ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు?
బాబూ.. మీ పాలనలో ఏం చేశారో తెలుసా?
మీ పాలనలో తిరుమలలోని మద్రాస్ నల్లి స్టోర్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌లో వ్యభిచార గృహాన్ని నడిపారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన వేయికాళ్ల మండపాన్ని నేలమట్టం చేసి ఆనవాళ్లు లేకుండా చేసింది మీ హయాంలోనే. అన్నమయ్య నివాసాన్ని కూల్చివేసి కనీసం ఆ మహానుభావుని జ్ఞాపకాలు లేకుండా చేసింది మీ పాలనలో కాదా? ఇక చంద్రబాబు చేసిన ఆరోపణలు ప్రాయశి్చత్తం చేసుకోవడానికి ఆలయ శుద్ధి అంటున్నారు. అసలు ఆలయ శుద్ధి గురించి ఆయనెలా చెబుతారు? ఆగమ పండితులు చెప్పాలి. తిరుమలలో శ్రీ వైష్ణవులు చేతితో లడ్డూలు తయారుచేస్తారు, ఏమాత్రం తప్పిదం జరిగినా వారు ఉపేక్షించరు.
ధర్మప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టింది మేమే..
వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో కనీవినీ ఎరుగని రీతిలో అనేకానేక ధర్మప్రచార కార్యక్రమాలను మేం చేపట్టాం.. ఉదా..
⇒ ఎస్వీబీసీ ఛానెల్ ప్రారంభించింది మేమే. దళిత గోవిందం పేరుతో శ్రీవారిని దళితవాడలకు తీసుకెళ్లి విప్లవాత్మక కార్యక్రమం చేపట్టాం. మత్స్య గోవిందం, గిరిజన గోవిందం కార్యక్రమాలూ నిర్వహించాం.
⇒ వేద విశ్వవిద్యాలయం స్థాపించిందీ.. వేద అధ్యయనాన్ని ప్రోత్సహించేందుకు విద్యార్థులకు రూ.2 లక్షలు డిపాజిట్ చేసింది మేమే.
⇒ శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహించింది మా పాలనలోనే. దళిత , బలహీనవర్గాల పెళ్లిళ్లు చేశాం. 36 వేల పేద జంటలకు తాళిబొట్లు తయారుచేయించి వాటిని స్వామివారి పాదాల చెంత పెట్టి వాటిని ఆ జంటలకు ఇచ్చాం.
⇒ అన్నమయ్య ఉత్సవాలు.. 75 మంది వేద పండితులతో విద్వత్ సదస్సు నిర్వహించిందీ మేమే. చిన్న పిల్లల్లో దైవభక్తి పెంచేందుకు గోవింద కోటి, రామకోటి పెట్టి స్వామి దర్శన భాగ్యం కల్పించింది మేమే. .. కానీ, మీ పాలనలో ఏ రోజైనా ఏమైనా చేశావా చంద్రబాబూ?
Comments
Please login to add a commentAdd a comment