మరొకరు రావాలి... బంగారు పతకం తేవాలి! | Milkha Singh flags off Hyderabad 10K Run | Sakshi
Sakshi News home page

మరొకరు రావాలి... బంగారు పతకం తేవాలి!

Published Mon, Dec 1 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

మరొకరు రావాలి... బంగారు పతకం తేవాలి!

మరొకరు రావాలి... బంగారు పతకం తేవాలి!

పుట్టింది: నవంబర్ 20, 1929
జన్మస్థలం: ల్యాల్‌పూర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది)
ప్రస్తుతం ఉండేది: చండీగఢ్‌లో
అందరూ పిలిచే ముద్దుపేరు: ఫ్లయింగ్ సిఖ్


కొన్ని విజయాలు
1958 ఆసియా క్రీడోత్సవాల్లో 200 మీటర్ల పరుగుపందెం విజేత
1958 ఆసియా క్రీడోత్సవాల్లో 400 మీటర్ల విజేత
1958 కామన్వెల్త్ క్రీడోత్సవాల్లో 440 యార్డుల పరుగుపందెంలో విజేత
1959లో పద్మశ్రీ పురస్కారం
1962 ఆసియా క్రీడోత్సవాల్లో 400 మీటర్ల విజేత

" నేనింతవరకూ ఎప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు. ఏ మందూ మింగలేదు. ఎప్పుడైనా కాస్త నలతగా ఉంది అనిపిస్తే రోడ్డెక్కుతాను. ఒళ్లు అలిసేలా పరుగు తీస్తాను. అంతే..
"

అంతర్జాతీయ వేదికపై అథ్లెటిక్స్‌లో మన దేశానికి బంగారు పతకం సాధించి పెట్టిన ఏకైక క్రీడాకారుడాయన. అరవై ఏడేళ్లుగా మరే భారతీయ క్రీడాకారుడూ అందుకోలేనన్ని విజయాలు ఉన్నాయి ఆయన ఖాతాలో. దాదాపు ఎనభై అంతర్జాతీయ రేసుల్లో విజేతగా నిలిచారు. ‘ఫ్లయింగ్ సిఖ్’ అంటూ అందరితో ముద్దుగా పిలిపించుకున్నారు. ఆయనే - మిల్కాసింగ్. భారతదేశ పతాకాన్ని విదేశీ గడ్డపై ఎగురవేసిన మిల్కా ఎందరో క్రీడాకారులకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచారు. జీవితం, విజయాలు, యువతరానికి సూచనల లాంటి పలు అంశాలపై మిల్కా సింగ్ ‘సాక్షి ఫ్యామిలీ’తో ముచ్చటించారు...
 
సికింద్రాబాద్‌లో అడుగు పెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. మీకు ఈ నగరంతో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి వివరిస్తారా?
సికింద్రాబాద్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. 1951లో సికింద్రాబాద్‌లోని ఈఎంఈ సెంటర్‌లో చేరాను నేను. నా పరుగు అప్పుడే మొదలయ్యింది. ‘ఆర్మీ బ్యారక్స్’లో ఉండేవాణ్ణి. రైలు పట్టాల మీద రైళ్లతో పోటీపడి పరుగులు తీసేవాడిని. రన్నింగ్ సాధన మొదలుపెట్టేసరికి నాకు నాలుగొందల మీటర్లు, వంద మీటర్లు అనే లెక్కలు ఉంటాయని తెలియదు. వాటి గురించి ఈఎంఈలో చేరిన తర్వాతే తెలిసింది. చేరిన కొత్తలో మమ్మల్నందరినీ ఐదు మైళ్లు పరుగెత్తమని చెప్పారు. వేగంగా పరుగెత్తినవారిలో మొదటి పదిమందిని తదుపరి శిక్షణ కోసం పంపిస్తామని, వాళ్లు భారత సైన్యం, భారతదేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారనీ చెప్పారు. నేను టాప్ 10లో స్థానం పొందాను. అథ్లెట్‌గా అది నా తొలి విజయం.
     
అప్పట్లో మిమ్మల్ని ప్రోత్సహించి, అండగా నిలిచినవారెవరు?
మా కోచ్ హవల్దార్ గురుదేవ్ సింగ్. సికింద్రాబాద్‌లోని ఆర్మీ స్టేడియంలో ఆయన ఆధ్వర్యంలోనే శిక్షణ పొందాను. ఆయన ప్రోత్సాహం మరువలేనిది.
     
ఇప్పుడీ నగరాన్ని చూస్తే ఏమనిపిస్తోంది?
హైదరాబాద్‌ని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇది క్రీడానగరంగా మారిపోయింది. ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులు ఉద్భవిస్తున్నారు. పతకాలు సాధిస్తున్నారు. దేశ గౌరవాన్ని నిలబెడుతున్నారు. ఈ విషయంలో పుల్లెల గోపీచంద్ లాంటి వారు చేస్తోన్న కృషి అమోఘం. క్రీడల విషయంలో నగరాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దుతున్నందుకు వారిని మెచ్చుకుని తీరాలి.
     
మిల్కాసింగ్ దేశానికే స్ఫూర్తి. మరి మీకెవరు స్ఫూర్తి?
అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతీయ జెండాను సగర్వంగా ఎగుర వేయాలని భావించాను. అందుకే, కష్టపడి సాధన చేశాను. అవరోధాల్ని అధిగమించాను. నాకు ప్రేరణగా నిలిచింది - చార్లీ జెన్కిన్స్. 1956లో నాలుగొందల మీటర్ల రేసులో గెలిచి ఒలింపిక్స్ బంగారుపతకం సాధించారాయన. ఆయన్ని చూసి చాలా స్ఫూర్తి పొందాను. ఆయన సాధించారు కదా, నేను సాధించలేనా అనుకున్నాను. అనుకున్నది సాధించాను. అందుకే అందుకు ఆయన నాలో రగిలించిన స్ఫూర్తి కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
 
ప్రస్తుతం అథ్లెటిక్స్‌లో మన ప్రాభవం ఎలా ఉందంటారు?
ఆ విషయంలో చాలా నిరాశపడుతున్నాను. గత అరవయ్యేళ్లలో మన దేశంలో మరో మిల్కాసింగ్ జన్మించకపోవడం నిజంగా దురదృష్టం. 120 కోట్ల జనాభాలో ఉండేది కేవలం ఒక్క మిల్కాసింగేనా?! మరో మిల్కాసింగ్‌ని మనం తయారు చేయలేమా?! దీన్ని బట్టి అర్థమవుతోంది మన దేశంలో క్రీడల పట్ల ఎంత అశ్రద్ధ ఉందో. పీటీ ఉష, అంజూ జార్జ్ లాంటి ఎవరో కొందరు అథ్లెట్లుగా రాణించారు తప్ప, గొప్పగా చెప్పుకోవడానికి మనకంటూ పెద్దగా ఎవరూ లేకపోవడం బాధాకరం.
     
ఈ పరిస్థితిని మార్చడానికి మనమేం చేయాలి?
మిల్కాసింగ్‌లు నగరాల్లో దొరకరు అన్న వాస్తవాన్ని ముందు గ్రహించాలి. దేశంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. వాటి మూలల్లోకి వెళ్లి వెతకాలి. ఉత్సాహం, ప్రతిభ ఉన్న యువతను వెతికి పట్టాలి. శిక్షణనివ్వాలి. నిజం చెప్పాలంటే ఇప్పటి పిల్లలో క్రీడల పట్ల ఆసక్తి కాస్త తక్కువగానే ఉంది. ఇక నగరాల్లోని పిల్లల విషయానికొస్తే... ఆటలాడటానికి కావలసినంత శక్తి కూడా వారిలో కొరవడుతోంది. అందుకే వాళ్లు క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ లాంటి వాటిని ఎంచుకుంటున్నారు తప్ప... శారీరక శ్రమ అధికంగా ఉండే అథ్లెటిక్స్‌ను ఎంచుకోవడం లేదు. అందుకే గ్రామాల్లోకి వెళ్లమంటున్నాను. అథ్లెట్లు అక్కడే దొరుకుతారు.
 
మీకిప్పుడు ఎనభయ్యేళ్లు దాటాయి. అయినా ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం?
నా వయసు ఎనభయ్యారు. అయినా ఇంకా పరుగులు తీస్తున్నాను, రేసుల్లో పాల్గొంటున్నాను. నిజానికి నాకూ కొన్ని సమస్యలు ఉన్నాయి. కంటిచూపు కాస్త తగ్గింది. నడుంనొప్పి వస్తోంది. అయినా నేను వాటిని లెక్క చేయకపోవడమే నా ఫిట్‌నెస్ సీక్రెట్. నేనెప్పుడూ అనుకుంటాను... టీనేజర్లతో సమానంగా నేనూ పరుగెత్తగలనని. అదే నన్ను ఉత్తేజితుణ్ణి చేస్తూ ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే నన్నింత పటిష్ఠంగా ఉంచింది.

నేనింతవరకూ ఎప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు. ఏ మందూ మింగలేదు. ఎప్పుడైనా కాస్త నలతగా ఉంది అనిపిస్తే రోడ్డెక్కుతాను. ఒళ్లు అలిసేలా పరుగు తీస్తాను. అంతే... నీరసం అదే ఎగిరిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... నేను నా నోటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటాను. అలా కాకుండా ఏది పడితే అది తినేశామా... బీపీ, షుగర్, ఒబెసిటీ, గుండె జబ్బులు అంటూ వరుసపెట్టి సమస్యలు వచ్చేస్తాయి.కాబట్టి ఆ ప్రమాదం రాకుండా జాగ్రత్తపడతాను. నోటిని అదుపులో ఉంచుకోవడం కూడా నాకు మేలు చేసింది. నేనెప్పుడూ అతిగా మాట్లాడను. అనవసర విషయాలు అస్సలు మాట్లాడను. కాబట్టి గొడవలు, వివాదాలు నా దగ్గరకు రావు. అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాను. మనసు బాగుంటే శరీరమూ బాగుంటుంది కదా!
     
మీ జీవితం ఆధారంగా ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం తీశారు. ఆ సినిమా తీస్తామన్నప్పుడు మీకేమనిపించింది?

చాలా సంతోషం వేసింది. సినిమా కూడా చాలా బాగా తీశారు. ఫర్హాన్ అఖ్తర్ నా పాత్రను అద్భుతంగా పోషించారు. నిజానికి నన్ను అందరూ మర్చిపోయిన సమయంలో ఈ సినిమా వచ్చి, నన్ను మళ్లీ జనబాహుళ్యంలో ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఈ సినిమా విడుదలయ్యాక... రకరకాల వేడుకలకు నన్ను రమ్మని ఆహ్వానిస్తూ నాలుగొందల వరకూ ఉత్తరాలు వచ్చాయి. నా జీవితాన్ని అంత అందంగా చూపించి, నన్ను మళ్లీ అందరికీ దగ్గర చేసినందుకు ఆ టీమ్‌కి నేనెప్పుడూ కృత జ్ఞుడినై ఉంటాను.
     
ఇన్నేళ్ల కెరీర్‌లో తీరని కోరిక ఏదైనా ఉందా?
ఏ క్రీడాకారుడికైనా ఒలింపిక్స్‌లో బంగారు పతకం ప్రదానం చేస్తున్న ప్పుడు ఆ క్రీడాకారుడి జాతీయ గీతాన్ని గౌరవసూచకంగా వినిపిస్తారు. కానీ, అథ్లెటిక్స్ విషయంలో వేదిక మీద మన జాతీయ గీతాన్ని వినే అదృష్టం ఇంతవరకూ కలగలేదు. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అది మాత్రమే కాక... మరో మిల్కాసింగ్‌ను చూడాలన్న కోరిక కూడా అలాగే ఉంది. నాలాంటి మరొకరు రావాలి. మన దేశానికి బంగారు పతకం తేవాలి. నేను చనిపోయేలోపు ఆ అద్భుత దృశ్యాన్ని చూడాలనుంది!
     
భావితరాలకు మీరిచ్చే సందేశం?
కష్టపడండి. కృషి, ఆత్మవిశ్వాసం, నిబద్ధత ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి. ఈ మూడూ పెంచుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.  - కె.జయదేవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement