‘పొద్దున నన్ను తిడుతారు.. రాత్రి నా పాటలు వింటారు’ | Adnan Sami Reacts to Padma Shri Flak | Sakshi
Sakshi News home page

‘పొద్దున నన్ను తిడుతారు.. రాత్రి నా పాటలు వింటారు’

Published Wed, Jan 29 2020 9:19 PM | Last Updated on Thu, Jan 30 2020 4:57 AM

Adnan Sami Reacts to Padma Shri Flak - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో జన్మించిన, పాకిస్తాన్‌ సంతతికి చెందిన అద్నాన్‌​కు పద్మశ్రీ ఎలా ఇస్తారని కాంగ్రెస్‌, ఎన్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇక తనను విమర్శించిన వారికి  సమీ కూడా ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. తనకు ఏ ఇతర రాజకీయ నాయకులు మధ్య విభేదాలు లేవని, ప్రభుత్వాన్ని విమర్శించడానికి నన్ను పావుగా వాడుకుంటున్నారని సమీ అన్నారు. బుధవారం ఆయన ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా తనపేరును ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. 

(చదవండి : బాలీవుడ్‌ పద్మాలు)

‘ నిజం చెప్పాలంటే.. రాజకీయ నాయకులకు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను సంగీత విద్వాంసుడిని. ఉదయం నా గురించి చెడుగా మాట్లాడినవారంతా.. రాత్రి సమయంలో మందు తాగుతూ.. నా పాటలు వింటూ ఉంటారు. సంగీతకారుడిగా, నా పని ప్రజలను సంగీతంతో సంతోషపెట్టడం, ప్రేమను వ్యాప్తి చేయడమే నా పని. సొంత రాజకీయాల కోసం కొంతమంది నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నన్న పావుగా వాడుకుంటున్నారు​. ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని నాపై చూపిస్తున్నారు. అని షమీ అన్నారు. 

పాకిస్తాన్‌ సంతతికి చెందిన అద్నాన్‌ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. అద్నాన్‌ సమీ తండ్రి పాకిస్తాన్‌ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. 1965 యుద్ధంలో పాక్‌ తరఫున భారత్‌తో పోరాడారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కుమారుడికి ఈ ఉన్నత స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంపై పలు విమర్శలు వచ్చాయి. ‘భజన’ కారణంగానే ఈ పురస్కారం లభించిందని కాంగ్రెస్‌ నేత జైవీర్‌ షేర్‌గిల్‌ ట్వీట్‌ చేశారు. 

ఇక సమీకి పద్మశ్రీ ఇవ్వడాన్ని బీజేపీ సమర్థించింది. తన ప్రతిభతో భారత ప్రతిష్టను ఇనుమడింపజేశారని, ఆ పురస్కారానికి సమీ అన్నివిధాలా అర్హుడేనని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా స్పందించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తండ్రికి నియంతలు ముస్సోలినీ, హిట్లర్‌లతో సంబంధాలున్నాయన్న వార్తలను గుర్తు చేస్తూ.. ఆమెకు భారతీయ పౌరసత్వం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ‘భారతదేశాన్ని, ప్రధాని మోదీని, దేశ వ్యవస్థలను వ్యతిరేకించే ముస్లింలకు మాత్రమే అవార్డులు ఇవ్వాలని విపక్షాలు కోరుకుంటున్నాయి’  అని సంబిత్‌ పాత్ర ఆరోపించారు. అద్నాన్‌ సమీ తల్లి నౌరీన్‌ ఖాన్‌ జమ్మూకి చెందిన వ్యక్తి అని గుర్తు చేశారు. ‘ఆ ప్రాంత ముస్లిం మహిళలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదా?’ అని ప్రశ్నించారు. లోక్‌జనశక్తి పార్టీ నేత, కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కూడా సమీకి పద్మశ్రీ ప్రకటించడాన్ని సమర్ధించారు. 

 కాగా, ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్‌లపై వెల్లువెత్తుతున్న నిరసనల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునే చర్యల్లో భాగంగానే అద్నాన్‌ సమీకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారని ఎన్సీపీ విమర్శించింది. ఇది 130 కోట్ల భారతీయులను అవమానించడమేనని పేర్కొంది. ‘జై మోదీ’ అని నినదించిన పాక్‌ పౌరుడెవరైనా భారత పౌరసత్వం పొందొచ్చని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ ఎద్దేవా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement