వీరేందర్ సింగ్ (PC: X)
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల ఫలితాలపై నిరసనగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు స్టార్ రెజ్లర్లు. వీరికి బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా బాసటగా నిలిచాడు. తనకు లభించిన పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ప్రకటించాడు.
సాక్షిని చూసి గర్విస్తున్నా
డెఫ్ ఒలింపిక్స్ (బధిర ఒలింపిక్స్)లో స్వర్ణ విజేతగా నిలిచిన వీరేందర్ ‘గుంగా పహిల్వాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘భారత మానస పుత్రిక, నా సోదరి సాక్షి మలిక్ కోసం నేను నా ‘పద్మ’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తా. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీజీ... సాక్షిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను. దేశంలోని దిగ్గజ క్రీడాకారులంతా దీనిపై స్పందించాలని నేను కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీరేందర్ ట్వీట్ చేశాడు.
స్పందించేందుకు నిరాకరించిన అనురాగ్ ఠాకూర్
మరోవైపు.. డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల ఫలితాలు, తదుపరి స్టార్ రెజ్లర్ల నిరసన నిర్ణయాలపై స్పందించేందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిరాకరించారు. బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్‌లో ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన అథ్లెట్లను అభినందించే కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘దీనిపై నేను ఇదివరకే చెప్పాల్సింది చెప్పా. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను’ అని ఠాకూర్ అన్నారు.
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి ఎన్నికకు నిరసనగా
కాగా డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. అంతేగాక డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ గెలవడం తమపై ప్రభావం చూపుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే.. ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలకగా.. మరో ఒలింపియన్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు.
చదవండి: నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment