న్యూఢిల్లీ: దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన భారత స్టార్ రెజ్లర్ల నుంచి మరో తీవ్రమైన నిర్ణయం వెలువడింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రెజ్లర్లు ఆటకు వీడ్కోలు పలకడం, ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను వెనక్కి ఇచ్చేయడం చేస్తున్నారు. ఇది భారత క్రీడాలోకానికి మచ్చగా మిగలడం ఖాయం!
డబ్ల్యూఎఫ్‌ఐలో తిష్ట వేసుక్కూర్చున్న వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ చెరలోనే రెజ్లింగ్ సమాఖ్య కొనసాగనుండటం, ఆయన వీర విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా గెలవడంతో గురువారం రియో ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. శుక్రవారం తాజాగా టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా భారత ప్రభుత్వం 2019లో ఇచ్చిన పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేశాడు.
రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి
బజరంగ్ పార్లమెంట్ వైపు వెళ్తుండగా కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడి రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి తన నిరసన లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి చేరేలా చూడాలని పోలీసు అధికారుల్ని బజరంగ్ వేడుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు. ‘ప్రధాని మోదీకి నేను పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నా. ఈ లేఖే నా ఆవేదనగా భావించాలి’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నాడు.
నిరసనగానే ఈ నిర్ణయం
ఇక ఆ లేఖలో ఏముందంటే... ‘మోదీజీ మీరు బిజీగా ఉంటారని తెలుసు. అలాగే గత కొన్నాళ్లుగా మహిళా రెజ్లర్లు పడుతున్న పాట్లు, బ్రిజ్‌భూషణ్ నుంచి ఎదుర్కొంటున్న వేధింపులు మీకు తెలుసు. దీనిపై మేం రెండుసార్లు రోడెక్కి నిరసించాం. న్యాయం చేస్తామన్న ప్రభుత్వ హామీతో మా దీక్షను విరమించాం. ముందుగా అసలు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు.
తాత్సారం తర్వాతే కేసు నమోదు చేశారు. మొదట్లో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా 19 మంది మహిళా రెజ్లర్లు స్టేట్‌మెంట్ ఇస్తే తదనంతరం ఈ సంఖ్య ఏడుగురికి పడిపోయింది. దీంతో అతని పలుకుబడి ఏ రకంగా శాసిస్తుందనేది అర్థమైంది. ఇప్పుడు మళ్లీ ఆయన వర్గమే రెజ్లింగ్ సమాఖ్యకు కొత్తగా ఎన్నికైంది. దీనికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని బజరంగ్ లేఖలో వివరించాడు.
అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఎన్నికల విషయంలో
మరోవైపు బజరంగ్ ‘పద్మశ్రీ’ని తిరిగిస్తుంటే కేంద్ర క్రీడాశాఖ తేలిగ్గా తీసుకున్నట్లుంది. వెనక్కి ఇవ్వడమనేది అతని వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. రెజ్లింగ్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారని... అయినప్పటికీ బజరంగ్‌ను తన నిర్ణయం మార్చుకోవాలని కోరతామని క్రీడాశాఖ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment